దంతెవాడలో మావోయిస్టుల దాడి

5
– ఏడుగురి జవాన్ల మృతి

చింతూరు,మార్చి30(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. దంతెవాడలో మందుపాతరతో జవాన్లను బలి తీసుకున్నారు.సీఆర్పీఎఫ్‌ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని బుధవారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ 230 బెటాలియన్‌కు చెందిన ఏడుగురు జవాన్లు దుర్మరణంపాలయ్యారు. వెంటనే భద్రతా దళాలు కూంబింగ్‌ చేపట్టారు. దంతెవాడ జిల్లా కువాకొండ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ 230 బెటాలియన్‌కు చెందిన 30 మంది జవాన్లు మూడు వాహనాల్లో సెలవుపై దంతెవాడకు వస్తున్నారు. ఈ క్రమంలో దంతెవాడ, సుక్మా రహదారిలోని కలార్‌పారా వద్ద జవాన్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు భారీ మందుపాతరను పేల్చారు. పేలుడు ధాటికి ఘటనా స్థలంలో 15 అడుగుల భారీగొయ్యి ఏర్పడగా జవాన్లు ప్రయాణిస్తున్న మినీట్రక్కు తునాతునకలైంది.అనంతరం మావోయిస్టులు సీఆర్పీఎఫ్‌ జవాన్లపై కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ 230 బెటాలియాన్‌కు చెందిన ఏఎస్‌ఐ విజయ్‌రాజ్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు ప్రదీప్‌తిర్కి, రంజన్‌దాస్‌, కానిస్టేబుళ్లు ఉదయ్‌కుమార్‌, దేవేంద్ర చౌరాసియా, ఆర్‌ఎన్‌ దాస్‌, కేదారుసులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరికొందరు జవాన్లను దంతెవాడ ఆసుపత్రికి తరలించారు. బస్తర్‌ ప్రాంతంలో తమ ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టు దర్బా డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ రమణ్‌సింగ్‌, ¬ంమంత్రి అజయ్‌ చంద్రాకర్‌లు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తమకు నివేదిక అందించాల్సిందిగా కేంద్ర ¬ంశాఖ వర్గాలు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాయి.