దాడి చేసిన వారిని బర్తరఫ్ చేయాలి: ఎర్రబెల్లి
హైదరాబాద్,మార్చి7(జనంసాక్షి): శనివారం సభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటన తెలంగాణ అసెంబ్లీకి మాయని మచ్చ అని టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అసెంబ్లీ విూడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ… తెరాస నేతలు తమ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావును కిందపడేసి కొట్టారని తెలిపారు. సభలో తమపై దాడి చేయించడం… ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజన వ్యాఖ్యానించారు. తమ పార్టీ సభ్యులపై టీఆర్‌ఎస్ సభ్యులు దాడి చేశారని ఆరోపించారు. తమ సభ్యులను కిందపడేసి కొట్టారని చెప్పారు. సభలో దాడికి దిగిన వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్‌లో చేరిన సభ్యులను అనర్హులను చేసే వరకు పోరాటం ఆగదన్నారు. టీఆర్‌ఎస్ గుండాలు తమపై దాడి చేయడం ప్రజాస్వామ్యం విలువలకు గొడ్డలిపెట్టు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ టీఆర్‌ఎస్ గుండాల సభగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమపై దాడి చేసిన వారిని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకునేవరకు అసెంబ్లీని నడవనీయబోమన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై, పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునే వరకు అసెంబ్లీ జరగనీయమని స్పష్టం చేశారు. దీనిని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని అనుకోలేదన్నారు. ఘర్షణలో టిడిపి ఎ మ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు గాయం అయిందని ఎర్రబెల్లి దయాకరరావు ఆయనను విూడియా ముందు చూపించి గౌడ్ వేలికి గాయం అయిందని, రక్తం కారిందని చెప్పారు. గతంలో ఎపి శాసనసభలో ఎప్పుడు కొట్టుకున్న ఘటన జరగలేదని ఎర్రబెల్లి అన్నారు. టిడిపి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుల ను టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కిందపడేసి కొట్టారని అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులు చేయాలని,.మహిళలకు, దళితులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలన్నదే తమ డిమాండ్ అని ఆయన అన్నారు. అమరవీరులకు సాయం చేయాలని కోరుతున్నాం. ఈ విషయాలపై తాము అడుగుతుంటే టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమపై దాడి చేడం సిగ్గుచేటని ఎర్రబెల్లి అన్నారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రౌడీల మాదిరే వ్యవహరించారని అన్నారు.ప్రకాష్ గౌడ్ టిఆర్‌ఎస్ లోకి రాలేదని కొట్టారని ఎర్రబెల్లి ఆరోపించారు. తమవాళ్లపై దాడి చేసేవరకు శాసనసభను నడవనివ్వబోమని అన్నారు.
కాగా మంత్రి హరీశ్ రావు ఉసిగొల్పడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ సభ్యులపై దాడి చేశారని టీడీపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు తమపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ పై చర్య తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ…. ‘ప్రజాస్వామ్యానికి దుర్దినం, దొరతనానికి శుభదినం’ అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని గవర్నర్ ను కోరినా పెడచెవిన పట్టడంతో ఆయన ప్రసంగానికి నిరసన తెలపాలనుకున్నామని చెప్పారు. తమను అడ్డుకున్న మార్షల్స్ పై చర్య తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరసన చెప్పడానికి టిడిపి పోడియం లోకి వెళ్లిందని, మంత్రి హరీష్ రావు ఉసికొల్పితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాడిచేశారని అన్నారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోట్ల గిత్తలు,ఎడ్ల మాదిరి దాడి చేశారని రేవంత్ విమర్శించారు. మార్షల్స్ వచ్చి అడ్డుకుంటే,టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేశారని,దీనికి సంబందించి వీడియో విడుదల చేయాలని రేవంత్ అన్నారు. దాడి చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని అన్నారు. రౌడీ ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటూ కెసిఆర్ చూస్తున్నారని, ఆయన నాయకత్వంలో జరిగిందని అన్నారు. అందువల్ల కెసిఆర్ పై కూడా గవర్నర్ చర్య తీసుకోవాలని రేవంత్ కోరారు.