దిగ్గిరాజా ఏం చేస్తారో?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఏం చేయబోతున్నారు.. ప్రత్యేక రాష్ట్రం, సమైక్యాంధ్ర డిమాండ్లలో ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారు అనేదానిపై అందరి దృష్టి నెలకొని ఉంది. దిగ్విజయ్‌సింగ్‌ స్వతహాగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకి. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు బాహాటంగానే చెప్పారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు ఏదో ముగింపు పలకాల్సిన సమయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిలుగా పనిచేసిన గులాంనబీ, వాయలార్‌ రవి, వీరప్ప మొయిలీలకు భిన్నంగా దిగ్విజయ్‌ వ్యాఖ్యలు లేవనే చెప్పాలి. చెప్పిన తీరులో తేడా ఉందితప్ప విషయం మాత్రం 2004 నుంచి చెబుతున్నదే. కాంగ్రెస్‌ వ్యూహంలో ఇదో భాగం. ఎపిలో ఇప్పుడు పంచాయితీ గాలి వీస్తోంది. ఆ తరవాత మున్సిపల్‌ గాలి వస్తుంది. ఆ తరవాత జనరల్‌ ఎన్నికల గాలి వస్తుంది. వీటన్నిటిని తట్టుకుని నిలవగలగాలి. ముఖ్యంగా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇప్పుడున్న లోక్‌సభ సీట్లలో అత్యధికంగా గెల్చుకోవాలి. అలా గెల్చుకుంటేనే రాహుల్‌ ప్రధాని కాగలడు. రాహుల్‌ను ప్రధాని చేసే క్రమంలో డిగ్గీరాజా ముందువరసలో ఉన్నారు. అందుకే ఇరువర్గాలను ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌ వర్గాలతో పాటు సామాన్యులను కూడా రాజావారు బుట్టలో వేసుకునే పని చేపట్టారు. ఎవరితీరు వారికి మాట్లాడి చెప్పగల సమర్థులు దిగ్విజయ్‌ సింగ్‌. అందుకే తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తేల్చేయబోతుందన్నారు. రాష్టాన్న్రి విభజించటమో, సమైక్యంగా కొనసాగించటమో ఏదో ఒక విస్పష్టమైన నిర్ణయం అతి త్వరలో రానుందన్నారు. వారం కావచ్చు, రెండు వారాలు కావచ్చు… త్వరలో జరగబోయే కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ దీనిపై ఒక నిర్ణయం ప్రకటించబోతోందని సూచించారు. కోర్‌కమిటీలో సభ్యులు కానప్పటికీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇటీవలి వరకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడిగా ఉన్న కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌, ప్రస్తుత పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌, సీఎం కిరణ్‌, పీసీసీ అధ్యక్షుడు బొత్స, డిప్యూటీ సీఎం రాజనర్సింహ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారరని చెప్పారు. అయితే ఇందులో కొత్తదనమేమంటే కోర్‌కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని మాత్రమే. రాష్ట్ర విభజన, సమైక్యంగా కొనసాగించటం.. ఈ రెండు అంశాల్లోని లాభనష్టాల్ని చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణపై ఆ సమావేశమే చివరిది కానుంది. అందులో తీసుకునే నిర్ణయం అమలు చేయటమే తరువాయని దిగ్విజయ్‌సింగ్‌ వెల్లడించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలాంటి సమావేవాలు గతంలోనూ బోలెడు జరిగాయి. సిఎం, గవర్నర్‌, బొత్స ఫైళ్లు పట్టుకుని ఎక్కని ఫ్లైటు, దిగని ఫ్లైటు లేదు. దీంతో ఇక తెలంగాణపై కాంగ్రెస్‌ తేల్చేయబోతోందంటూ కాంగ్రెస్‌ తెలంగాణ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. ఏమి తేల్చేయబోతున్నదన్నది ఇక్కడ ఇంకా అస్పష్టమే. రాష్ట్ర విభజన వ్యవహారంపై ఒకింత కుండబద్దలు కొట్టినట్లుగా సూటిగా, స్పష్టంగా చెప్పేశారని ఎవరికి వారు భాష్యం చెప్పుకున్నారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని దిగ్విజయ్‌ తేల్చి చెప్పారు. గతకొంత కాలంగా ఇరుప్రాంతాల నేతలు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే ఓ విషయంలో దిగ్విజయ్‌ స్పష్టత ఇచ్చారని అనుకోవాలి. ‘విభజన బాధాకరమని, తాను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రాష్ట్రం నుంచి ఛత్తీస్‌గఢ్‌ విడిపోయిందని, అప్పట్లో విద్యుత్తు ప్రాజెక్టులన్నీ ఛత్తీస్‌గఢ్‌లో ఉంటే, వినియోగమంతా మధ్యప్రదేశ్‌లో ఉండేదని, అదో పెద్ద సమస్యగా మారిందన్నారు. పంజాబ్‌, హర్యానా విడిపోయి నాలుగు దశాబ్దాలు దాటినా ఆ సందర్భంగా కోర్టులో వేసిన కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. . విభజన అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ప్యూను వరకు, బల్ల నుంచి కుర్చీ వరకు అన్నింటినీ పంపకం చేయాల్సి ఉంటుందన్నారు. . తెలంగాణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి బంట్రోతు వరకు అందరి అభిప్రాయాలను ఇప్పటికే అధిష్ఠానం తీసుకుంది. రానున్న కోర్‌ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం వస్తుంది. రాష్ట్రం ఇప్పటిలా సమైక్యంగా ఉంటే లాభనష్టాలేంటి? విడిపోతే కలిగే లాభనష్టాలేంటి? ఏ నిర్ణయం తీసుకుంటే దానిని ఎలా అమల్లో పెట్టాలి అనే అంశాలపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నివేదికలివ్వాలి. వారిద్దరూ కలిసి ఒకే నివేదిక ఇస్తే సరే. విడివిడిగా ఇచ్చినా ఫర్వాలేదు.’ అని తేల్చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా కోర్‌కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది సస్పెన్స్‌. విడిపోతే రాష్టాల్ర మధ్య జల వివాదాలూ వస్తాయని ప్రస్తావించారు. ఒకసారి అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నాక దానికి తప్పనిసరిగా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించారు. మొత్తానికి ఇప్పుడు రోడ్‌మ్యాప్‌ సిద్ధం అవుతుందా లేదా అన్నది ఇక వేచి చూడాలి. మధ్యప్రదేశ్‌ను విభజించిన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్‌ ఇక ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న కాలంలోనూ విభజనతో ముగింపునిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.