దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డికి సభ సంతాపం

4

– ఆయన సేవలను కొనియాడిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి):ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతిపట్ల తెలంగాణ శాసనసభ సంతాపం ప్రకటించింది. రెండోరోజు శాసనసభ ప్రారంభమైన వెంటనే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపి, తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజా జీవితంలో ఆయన ఎన్నో పదవులు అధిష్టించారని, ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. రాంరెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటరెడ్డి మితభాషి, మృదు స్వభావి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వెంకటరెడ్డి సేవలను కొనియాడారు. ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారని, ఒకసారి పూర్తి కాలం మంత్రిగా పనిచేశారని అన్నారు. వ్యవసాయం, పశుపోషణలో రాంరెడ్డి వెంకటరెడ్డిది మంచి నైపుణ్యం గలవారని అన్నారు. ఎన్నిచోట్ల ఎద్దుల పోటీలు పెట్టినా వెంకటరెడ్డి గిత్తలకే అవార్డు వచ్చేదని అన్నారు. రాజకీయాల్లో కూడా మంచి హుందాను కొనసాగించారని చెప్పారు. అలాంటి నేతకు క్యాన్సర్‌ రావడం దురదృష్టకరమని, ఆయన వైద్యానికి ప్రభుత్వం తరుపున వైద్య ఖర్చులు కూడా ఇచ్చామని తెలిపారు. వ్యక్తిగతంగా, ప్రభుత్వం తరుపున వెంకటరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వారి కుటుంబానికి మనోస్థైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ… రాంరెడ్డి వెంకటరెడ్డితో తన అనుబంధాన్ని గుర్తు చేశారు. ఆయనతో తనది విడదీయరాని అనుబంధమన్నారు.  పశుపోషణ, ఎడ్లపందేలు ఆయనకు ఇష్టమైన వ్యాపకాలని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌ పార్టీలో రాంరెడ్డి పనిచేశారని వివరించారు.  ఆయనతో తనకు 33 ఏళ్ల ఆత్మీయ అనుబంధం ఉందన్నారు.  విద్యార్థి దశ నుంచే రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలపై ఆసక్తిచూపారని అన్నారు. వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని, సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి లేని లోటు తీర్చలేనిదని, కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. గత 30 ఏళ్లుగా ఆయన సేవలందించారని చెప్పారు. వెంకట్‌రెడ్డి రైతు పక్షపాతి అని తెలిపారు. రాంరెడ్డి మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు అని చెప్పారు. రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఖమ్మం జిల్లా రాజకీయాల్లో 1967 నుంచి యోధుడిగా పనిచేశారని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యం చూపిన వ్యక్తి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఆయన ప్రజల కోసం ఎంతో సేవ చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఆయన మృతికి సంతాపం తెలిపి, సేవలను గుర్తు చేసుకున్నారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చాలా కలుపుగోలు వ్యక్తి అని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. వెంకట్‌రెడ్డి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే జలగంఅన్నారు. ఖమ్మం జిల్లా పెద్ద దిక్కును కోల్పోయింది, ఆయన మృతికి కాంగ్రెస్‌కు తీరని లోటు అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ అన్నారు. వెంకట్‌రెడ్డి మృతి బాధాకరం, రాజకీయ విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి రాంరెడ్డి అని ఎమ్మెల్యే లక్ష్మణ్‌ నివాళి అర్పించారు. రాంరెడ్డి గిరిజనులకు ఆప్తమిత్రుడు అంటూ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ అన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. గిరిజనుల జీవితాలతో మమేకమైన నేత రాంరెడ్డి అని గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ శాసనసభ శనివారానికి వాయిదా పడింది. రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి సంతాపం తెలిపిన అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు.