దేవీప్రసాద్ ఓటమిపై ముక్కున వేలేసుకుంటున్న తెలంగాణవాదులు
తెలంగాణ స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉద్యమ నేతకు పట్టంకట్టిన తెలంగాణ ఓటర్లు మనసు మార్చుకున్నారా? కేసీఆర్ 9 నెలలపాలనపై జనం అసంతృప్తితో ఉన్నారా? హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల భారీ నష్టంతో టీఆరెస్ తరపున బరులో నిలిచిన ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ఓటమికి కారణాలేంటి? కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు దేవీప్రసాద్ ఓటమికి కూడా అనేక కారణాలున్నాయి. అందుకే ఈ ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు రెఫరెంఢంగా భావించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఇదే సమయంలో జరిగిన మరో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అధికారపార్టీ టీయారెస్ తరపున పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. అయితే టలా రెండు స్థానాల్లో ఫలితాలు భిన్నంగా రావడంపై అధికారపార్టీతోపాటు తెలంగాణవాదులు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం కావటంలో
తనదైన పాత్ర పోషించిన దేవీప్రసాద్ ఓటమిని సగటు తెలంగాణవాది జీర్ణించుకోలేకపోతున్నడు. తెలంగాణవాదులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నరు. మహాకవి కాళోజీ ప్రాంతేతరులు, ప్రాంతవాసులను పోలుస్తూ రాసిన కవిత ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నరు. ప్రతిపక్షాలన్నీ ఏకమై దేవీప్రసాద్ ఓటమి కోసం అహోరాత్రులు శ్రమించటం ఒకెత్తయితే, హైదరాబాద్, రంగారెడ్డిల్లో సెటిలైన సీమాంధ్రుల ప్రభావం దేవీప్రసాద్‌పై స్పష్టంగా పడింది. సీమాంధ్ర సెటిలర్ల ఓట్లన్నీ బీజేపీకి పోలవడంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలిపోయింది. పోలైన ఓట్ల శాతం సగానికి తక్కువ ఉంటే వాటిలో ఒక జూబ్లీహిల్స్ లాంటి సీమాంధ్ర సెటిలర్ల అడ్డాలో 50 శాతానికిపైగా ఓట్లు నమోదు కావడం ఎమ్మెల్సీ ఎన్నికలను సెటిలర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రధాన కారణం ఇదే అయినా దీనికితోడు దేవీప్రసాద్ అభ్యర్థిత్వం ఖరారు కావడం ఆలస్యం కావడం, గెలుపుపై అతి ఆత్మవిశ్వాసం ఎక్కువకావడం మూలాన ప్రచారంలో వహించిన నిర్లక్ష్యం కూడా కొంత ప్రభావం చూపింది. దీనికితోడు మూడు సార్లు ఓడిపోయిన భాజపా అభ్యర్థి రామచంద్రరావుపై సానుభూతి కొంతమైరర ప్రభావం చూపిందని చెప్పొచ్చు. అంతేకాక కీలకసమయంలో ఉద్యోగులకు బకాయిలు నగదు రూపంలో చెల్లించకుండా బాండ్లు ఇవ్వడం కూడా దేవీప్రసాద్ ఓటమికి కారణమైంది. వీరిలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు కూడా అధికంగా ఉండటం మరింత ప్రభావం చూపింది. ఈ రకంగా ఉద్యమకెరటం దేవీప్రసాద్ ఓటమికి రకరకాల కారణాలు దోహదంచేశాయి. కానీ తెెలంగాణవాదుల మద్దతు ఉద్యమపార్టీకే ఉందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు స్పష్టం చేస్తున్నది. సెటిలర్ల ప్రభావం పెద్దగా ఉండని వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థికి చెల్లని ఓట్లు పోగా మరో 20వేల భారీ మెజారిటీ రావటాన్ని బట్టి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అంకం ముగిసింది. ఉద్యమనేతను ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు బంగారు తెలంగాణ లక్ష్యంగా తమ బతుకులు బంగారంలా ఉండాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం చేతనైనంత చేస్తున్నా ఇంకా క్షేత్రస్థాయిలో మరిన్ని ఫలాలు అందాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పటభద్రులు ఉద్యోగాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. అసలైన కారణాలు మాత్రం వేరే ఉన్నప్పటికీ నిరుద్యోగుల ప్రభావం కూడా కొంతవరకు దేవీ ప్రసాద్‌పై పడింది. సాంకేతికంగా దేవీప్రసాద్ ఓటమి అధికార పార్టీ ఓటమి అయినప్పటికీ దీనిపై మరింత విశ్లేషణ అవసరం ఉంది. ఇప్పటికే రెండు మూడు సార్లు ఓటర్లను కలిసి ఓట్లడిగిన బీజేపీ అభ్యర్థికి సానుభూతి ఓట్లు కూడా కలిసివచ్చిన అంశం. అంతేకాక పోలైన ఓట్ల శాతం తక్కువుండటంతోపాటు పోలైన ఓట్లలో దాదాపు 10వేల పైచిలుకు ఓట్లు మురిగిపోవడం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. నిజానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా దేవీప్రసాద్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. కానీ అధికారపార్టీని ఓడించటానికి విపక్షాలన్నీ ఏకంకావడంతో దేవీప్రసాద్‌కు ఎదురుగాలి వీచిందని చెప్పాలి. కాంగ్రెస్ బరిలో లేనట్లుగానే వ్యవహరించడం, సీమాంధ్ర సెటిలర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ మద్దతుదారులైన వాళ్లంతా బీజేపీకి ఓటేయడం కలిసొచ్చిన అంశంగా చెప్పొచ్చు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబుబ్‌నగర్ నుంచి బీజేపీ గెలుపొందిన తీరు నుంచి అధికార టీయారెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుని, తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సీమాంధ్ర సెటిలర్లపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. కుక్కతోక సక్కగ కాదన్నట్టు ప్రాంతేతరుల బుద్ధి మారదుగాక మారదు. వాళ్ల కాలి ముల్లు మన పంటితో తీసినా, ఇక్కడోళ్లంత తెలంగానోళ్లేనని గొంతు చించుకున్నా ఈ మట్టిపుత్రులను దూరం చేసుకోవడానికి తప్ప మరో ప్రయోజనం ఆశించడం అత్యాశే అవుతుంది. దేవీప్రసాద్ తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన పాత్ర అచంచలమైనది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా జరిగిన ఎన్నో పోరాట రూపాల్లో ప్రదానంగా చెప్పుకోదగింది సకలజనుల సమ్మె. టీఎన్జీఓస్ అధ్యక్షుడిగా ఉద్యోగ సంఘాల తరపున జేఏసీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ దేవీప్రసాద్ మొక్కవోని దీక్షతో తెలంగాణ సాధనలో పాలుపంచుకున్నారు. 45రోజులకుపైగా సాగిన సకలజనులసమ్మెలో ఉద్యోగులంతా బెదిరింపులకు లొంగకుండా, జీతాలు నిలిపేసినా, అదరక బెదరక ఉద్యమానికి దన్నుగా నిలబడేలా చేయగలగటంలో ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్ పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంతోనూ సంయమనంతో శాంతియుతంగా ఆంధ్ర ఉద్యోగులతో విభేదిస్తూనే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లటంలో కీలకపాత్ర పోషించారు దేవీప్రసాద్. ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా చెప్పుకోదగ్గ పరిణామాల్లో కీలకమైన అంశం ఇక్కడ సెటిలైన ఆంధ్ర ఉద్యోగులపై ఎలాంటి దాడులు జరగకుండా విశిష్ట నాయకత్వం వహించిన ఘనత దేవీప్రసాద్‌కే సొంతం. దేవీప్రసాద్‌ది ఆదినుంచే వినూత్న ఒరవడి. ఉద్యోగ సంఘాల నేతగా పలు సమస్యల పరిష్కారానికి ఆయన విశేష కృషి చేశారు. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించటంలో దేవీప్రసాద్‌ది కీలకపాత్ర. సమస్యల పట్ల అవగాహన, పరిష్కారానికి చిత్తశుద్ధి ఉన్న దేవీప్రసాద్ లాంటి వారు సభలో ఉంటే సభకే తరగని వన్నె వస్తుందనటంలో సందేహం లేదు. కానీ తెలంగాణవాదుల ఆకాంక్షలు సెటిలర్ల కుట్రల ముందు చిన్నబోయినయని తెలంగాణ వాదులంటున్నరు. సౌమ్యుడు, గుణవంతుడు, మేధావి దేవీప్రసాద్ లాంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులను మరింథ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. బంగారు తెలంగాణ లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం గమ్యాన్ని ముద్దాడటానికి దేవీప్రసాద్‌కు తిరిగి మరో మంచి అవకాశమిచ్చి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత అధికారపార్టీపై అధినేతపై ఉంది.