దేవీ ప్రసాద్ అంటే నాకు గౌరవం
ఆయనకు మద్దతుపై పార్టీలో చర్చిస్తా
తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్,మార్చి6(జనంసాక్షి): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని దేవీప్రసాద్ ఆయనను కోరారు. దేవీప్రసాద్ పట్ల తమకు ఎప్పుడూ సదభిప్రాయం ఉందని, పార్టీలో చర్చించాక దేవీప్రసాద్‌కు మద్దతు విషయమై వెల్లడిస్తామని తమ్మినేని పేర్కొన్నారు. ఇదిలావుంటే టీఆర్‌ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీఐటీఏ) మద్దతును ప్రకటించింది. ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థి,ఉద్యమ నేత దేవీప్రసాద్ కు సంపూర్ణ మద్దతివ్వనున్నట్టు ఐటీ అసోసియేషన్ సభ్యులు ప్రకటన జారీ చేశారు. ఈ విషయమై టీఎన్జీవో అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోరులో ఉన్న తనకు టీఐటీఏ మద్దతును ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇస్తే సమర్థవంతమైన నాయకత్వ పటిమతో సేవలందిస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు మద్దతు ప్రకటించిన వారిలో టీఐటీఏ ఉపాధ్యక్షుడు నవీన్‌గడ్డం, రాణాప్రతాప్ బొజ్జం, కార్పోరేట్ వింగ్ చైర్ విష్ణుమూర్తి కాలగోని, సంయుక్త కార్యదర్శి రవి ఆంథోని, స్వామి దేవ, ఎండీ మన్సూర్, నవీన్ తదితరులున్నారు.