దేశంలో సమగ్ర వ్యవసాయ విధానమేదీ?
ప్రధానిగా మోడీ అధికారం చేపట్టిన తరవాత వ్యవసాయ విధానంలో మార్పులు వస్తాయని భావించిన వారికి నాలుగేళ్లయినా ఎలాంటి ఊరట దక్కలేదు. పదిరాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తుండం చూస్తే రైతులు ఎంతగా ఆందోళనలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రైతులకు రెట్టింపు ధరలు లభ్యమయ్యేలా వ్యవసాయగతిని మారుస్తామని చెప్పిన ప్రధాని మోడీ మాటతప్పారు. దీంతో రైతులకు తాయిలాలు ప్రకటించడం, ఇంకా రుణమాఫీలు చేస్తామన్న హావిూలు రావడం, లేదా ఏదో ఒక ప్యాకేజీ ప్రకటన చేయడం జరుగతూ వస్తోంది. నిర్దిష్ట వ్వయసాయ విధానం లేకపోవడం వల్ల రైతులు నిత్యం అవస్థలు పడుతున్నారు.నిజానికి దేశంలో ఓ సమగ్రమైన వ్యవసాయ విధానాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఉంది. రైతన్నకు ఎంతో చేస్తున్నామని పాలకులందరూ అంటున్నా, ఏటా కనీసం ఐదారువేలమంది రైతులు దేశంలో ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు. దీనికి కారణాలు తెలుసుకోవడం లేదు. నిపుణులు ఇచ్చే సలహాలు పాటించడం లేదు. కష్టనష్టాలన్నీ భరించే కౌలురైతుల చేతులవిూదే అధికభాగం వ్యవసాయం జరుగుతున్నా వారిని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. 70శాతం మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో మూడోవంతు వ్యవసాయయోగ్యమైన భూమికి మాత్రమే నీరందుతోంది. మిగతా భూముల్లో వరుణిడి కరుణపై ఆధారపడి వ్యవసాయం సాగుతోంది. అలాంటప్పుడు పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర వ్యవసాయ విధానం రావాలి. తెలంగాణలో సిఎం కెసిఆర్ ఓ పద్దతి ప్రకారం వ్యవసాయాన్ని ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు. ప్రధానంగా ఆయన గుర్తించిన సమస్యల మేరకు సాగుతున్నారు. నీరు, విద్యుత్, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు ఇవ్వడం, బీమా చేయించడం అన్న అంశాల ఆధారంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పించి గిట్టుబాటు ధరలు దక్కేలా, ధాన్యం కొనుగోల్లు జరిగేలా, గోదాముల నిర్మాణం ద్వారా పంటలను దాచుకునేలా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఓ ప్రయోగంగా ముందుకు సాగుతున్నారు. ఇవే ఇప్పుడు తెలంగాణలో రైతాంగానికి వరంగా మారాయి. రైతుల్లో భరోసా పెరిగింది. ఇలాంటి విధానాలు సమగ్రంగా చేసుకుని దేశీయ వ్వయసాయ విధానం అమల్లోకి తసీఉకుని వస్తే బాగుండేది. కానీ ఈ దేశ వ్యవసాయ విధానంలో రాజకీయం జోడించడం వల్ల ప్రయోజనాలు పక్కదారి పడుతున్నాయి. మోడీ కూడా దాని నుంచి బయటపడడం లేదు. చెరకు రైతుల కష్టాలు కడతేర్చే పేరిట కేంద్ర మంత్రివర్గం బుధవారం కొన్ని నిర్ణయాలు చేసింది. యూపిలోని కైరానాలో ఓటమితో చెరుకు రైతులకు ప్యాకేజీ ప్రకటించినా ఇదంతా స్టంట్‌గానే భావించాలి. నాలుగేళ్ళక్రితం నాటి సార్వత్రక ఎన్నికల్లోనూ, ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీని నెత్తినపెట్టుకున్న యూపీ చెరకు రైతులు కైరానాలో కొట్టిన దెబ్బతో బీజేపీ అప్రదిష్టపాలైంది. మిల్లులనుంచి రావలసిన మొత్తాలు రాకపోవడం సహా పలు కష్టాల్లో కూరుకుపోయిన చెరకు రైతాంగానికి యోగి ఆదిత్యనాథ్ మాటసాయం తప్ప ఆదుకున్నదేవిూ లేదు. కేంద్ర మంత్రివర్గం ప్రకటించిన ఏడువేలకోట్ల రూపాయల ప్యాకేజీ కేవలం ఊరడింపు తప్ప మరోటి కాదు. దీనిబదులు వ్యవసాయానికి అనుభవం ఉన్న వారిని మంత్రులుగా పెట్టి సానుకల నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ నాలుగేళ్లలో గతి మారి ఉండేది. కానీ ఇక్కడ చిత్తశుద్ది లేదని ప్రస్తుత పాలనాతీరు చూస్తే అర్థం అవుతుంది. దేశంలోని పలురాష్ట్రాల్లో కొద్దిరోజులుగా రైతాంగ సమ్మె చేస్తున్నా కేంద్రం ఖాతరు చేయడంలేదు. రైతులు ఆగ్రహంతో రోడ్లవిూద, బహిరంగస్థలాల్లో పాలు తదితర ఉత్పత్తులు పారబోస్తూ నిరసనలు గట్టిగానే తెలియచేశారు. రైతాంగ ఉద్యమం కారణంగా పలు రాష్ట్రాల్లో కూరగాయలరేట్లు పెరిగి, లక్షలాది లీటర్ల పాలకొరత ఏర్పడింది. సవిూప పట్టణాలకు పాలు,కూరగాయల సరఫరా ఆగిపోయింది. ఈ ఆందోళన చివరిరోజైన 10వతేదీన రైతులు ‘భారత్ బంద్’ నిర్వహించబోతున్నారు. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో రైతుల ఆగ్రహం శృతిమించి అధికారులపై దాడులు జరిగాయి. రాస్తారోకోలు, వాహనాల ధ్వంసం వంటి హింసాత్మక సంఘటనల అనంతరం కాల్పులు జరిగి పదిమంది రైతులు మరణించారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలనీ, తమకు కనీస ఆదాయం లభించేవిధంగా ఒక పథకాన్ని తేవాలనీ, ఎరువుల ధరలు తగ్గించాలనీ, ముఖ్యంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పరిపూర్ణంగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇవన్నీ ఎన్నికల సమయంలో పార్టీలు హావిూలు ఇస్తున్నవే. వ్యవసాయరంగాన్ని ఉమ్మడిజాబితాలోకి తీసుకురావడం, రైతువేసే ప్రతి పంట సాగువ్యయాన్నీ కచ్చితంగా లెక్కగట్టి యాభైశాతం అధికంగా మద్దతు ధర ఇవ్వడం, ప్రతీ పంటకు బీమా ఇత్యాది సూచనలు అమలు చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. ఇదంతా సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడం జరుగుతున్న దారుణంగా చూడాలి. కాలమేదైనా, పంట ఏదైనా రైతులను ఆదుకునేలా విధానం ఉండాలి. బ్యాంకులను ముంచి వేలకోట్లను దోచుకుని ఉడాయిస్తున్న వారిని పట్టించుకోక పోవడం వల్ల దేశం దివాళా తీస్తోంది. ఇందులో కీసం పదోవంతయినా వ్యవసాయరంగానికి వెచ్చిస్తే దేశంఆర్థికంగా బాగుపడేది. వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ ప్రమాణాలు దక్కి ఎగుమతులు పెరిగేలా చేస్తే, దిగుమతులు చేసుకునే దౌర్భాగ్యం రాదు.ఎగుమతి,దిగుమతుల విధానంలో కూడా మార్పు రావాలి. ప్యాకేజీలు,మాఫృలు కాకుండా సమగ్రంగా వ్యవసాయ విధానం అమల్లోకి రావాలి. అప్పుడే భారతీయ వ్యవసాయరంగం వెలుగులీనుతుంది. రైతులు అనవసరంగా ధర్నాలు చేయడం లేదా,ఆత్మహత్యలకు పాల్పడే ఆగత్యం రాదు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మేల్కోకుంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు.