దేశవ్యాప్తంగా ప్రధాని బీమా పథకాల ప్రారంభం

C

– లాంచనంగా కోల్‌కతాలో ప్రారంభించిన ప్రధాని

– మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవండి

– హింసతో సాధించలేరు

– ఛత్తీస్‌గఢ్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ప్రారంభించిన ప్రధాని

కోల్‌కతా/రాయపూర్‌, మే 9(జనంసాక్షి):    దేశవ్యాప్తంగా మూడు ప్రధాన బీమా పథకాలు శనివారం ప్రారంభమయ్యాయి. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాలను ప్రవేశపెట్టారు.  ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సామాజిక భద్రత పథకాలను కోల్‌కతాలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు హాజరయ్యారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(యాక్సిడెండ్‌ ఇన్సూరెన్స్‌), ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి యోజన(లైఫ్‌ ఇన్సూరెన్స్‌), అటల్‌ పెన్షన్‌ యోజన పథకాలను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పేదలకు అండగా నిలవడానికి ఈ పథకాలు ప్రవేశ పెట్టామని అన్నారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలపడానికి అభివృద్ధి ఒక్కటే మార్గమని ప్రధానమంత్రి నరేంద్రమోడి స్పష్టం చేశారు. భుజంపై తుపాకి సమస్యలను పరిష్కరించదని, భుజంపై నాగలితోనే పరిష్కారం లభిస్తుందన్నారు. నక్సలిజం పుట్టిన గడ్డపై ఒకప్పుడు రక్తపుటేరులు పారాయని, కానీ ఇపుడా గడ్డపై ప్రశాంతత నెలకొందన్నారు. నక్సలైట్ల నరమేధానికి త్వరలోనే ముగింపు పలుకుతామన్న నమ్మకం తనకుందని మోడి పేర్కొన్నారు. ఈ గడ్డపై తప్పుడు మార్గంలో నడుస్తున్న నక్సలైట్లలో కూడా ఏదో ఒకరోజు మానవత్వం మేల్కొంటుందన్నారు. హింసకు ఎలాంటి భవిష్యత్తు లేదని, శాంతి మార్గమే భవిష్యత్తుకు మూలమన్నారు.  హింసామార్గాన్ని విడిచిపెట్టాలని మావోయిస్టులకు పిలుపుఇస్తున్నాం. నక్సల్స్‌ సమస్య గురించి బయటపడితే ఛత్తీస్‌గఢ్‌ దేశంలోనే మొదటిస్థానంలో ఉంటుందన్నారు.  హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారు కూడా మానవత్వంతో మారుతారని భావిస్తున్నానన్నారు. పేదలు, రైతులకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని తెలిపారు. ఛత్తీస్‌ఘడ్‌ పర్యటనలో భాగంగా దంతెవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మోడి పాల్గొన్నారు. ప్రధాని పర్యటనను నిరసిస్తూ మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మారుమూల, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. యువత ఉపాధికి తగిన అవకాశాలు కల్పిస్తామని మోదీ హావిూ ఇచ్చారు. ఉపాధి ఎంత ముఖ్యమో తనకు తెలుసని, ఉపాధి కల్పిస్తేనే ప్రజలు తమ బిడ్డలను చదివించగలరని, బతకడానికి ఒక నీడ ఏర్పర్చుకోగలరని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ పథకాల అన్నిటి వెనక ఉపాధి కల్పన తప్పనిసరి అంశంగా ఉంటుందన్నారు. దంతేశ్వరి మాత కృపతో ఇక్కడ నివసించే ఆదివాసీలు ఎలా జీవించవచ్చో ప్రపంచానికి నేర్పించారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మొదటిసారిగా రూ.24వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీని ద్వారా బస్తర్‌ ప్రాంతం ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఊహించగలనన్నారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు. భారత్‌ దేశవ్యాప్తంగా రైలు మార్గాలు ఏర్పాటుచేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 4 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన స్టీల్‌ ఫ్యాక్టరీకి ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో పర్యటన సందర్భంగా రెండు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పీఎం మాట్లాడుతూ.. స్టీల్‌ ఫ్యాక్టరీ ద్వారా వేలాదిమంది నిరుద్యోగ యువకులకు ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే ఇకముందు ఐరన్‌ దిగుమతులు లేకుండా చేస్తామన్నారు.  గత ప్రభుత్వ కాలంలో పత్రికల నిండా కుంభకోణాల వార్తలే ఉండేవి. గత సంవత్సరం నుంచి అలాంటి వార్తలకు తావు లేకుండా చేసామని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ  ఉదయం 11.15 గంటలకు దంతేవాడకు చేరుకున్నారు. 11.17 నిమిషాలకు విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. 11.32 గంటలకు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 11.50 గంటలకు సాక్ష్యం విద్యాలయాన్ని సందర్శించారు. 12.42 గంటలకు మావోయిస్టు ప్రభావిత దంతేవాడలో ప్రసంగించారు. కాగా ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ ఇవాళ మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మానవ రహిత విమానం ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాగా, ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాత్రి సుకుమా జిల్లాలోని మారెంగ గ్రామం నుంచి 5 వందల మంది గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ మావోయిస్టులు ఘాతుక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. సుకుమా జిల్లాలోని మారెంగ గ్రామంలో 5 వందల మంది గ్రామస్థులను అపహరణతో వదలలేదు. జగదల్‌పూర్‌ కుంహార్‌-కాకలూరు రైల్వే మార్గంలో రైలు పట్టాలను తొలిగించారు. దీంతో కిరండోల్‌-విశాఖ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దంతెవాడ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది అని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో పర్యటించారు. అక్కడ రమణ్‌సింగ్‌, పలువురు నేతలతో కలిసి బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రమణ్‌సింగ్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి రూ.24వేల కోట్లు కేటాయించినందుకు, బస్తర్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మెగా స్టీల్‌ ప్లాంట్‌ ప్రారంభమైతే 10వేల మందికి పైగా ఉపాధి దొరుకుతుందన్నారు. 2019లోగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తానని హావిూ ఇచ్చారు.