దొంగబాబాల పనిపట్టాల్సిన సమయమిదే

బాబా ముసుగులో అకృత్యాలకు పాల్పడ్డ డేరాబాబకు జైలు శిక్ష పడడానికి ఎంతోకాలం పట్టింది. ఈదేశంలో సత్వర న్యాయం జరగదని, అయితే ఆలస్యంగా అయినా పాపం పండుతుందని మాత్రం రుజువయ్యింది. డేరాబాబా అకృత్యాలు ఎన్నో ఉన్నాయి. అతడు చేసిన రాక్షసకాండను వెలికితీసినప్పుడే నష్టపోయిన అమాయకులకు ఊరట దక్కుతుంది. ఇకపోతే బాబాలు, స్వచ్ఛంద సంస్థలు, సేవల ముసుగులో అకృత్యాలు జరపకుండా కఠిన చట్టాలు చేయాలి. ఏ పనైనా పారదర్శకంగా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకునేలా చట్టం ఉంటే తప్ప అకృత్యాలకు తావుండదు. సేవల ముసుగులో అకృత్యాలు సాగకుండా ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలి. బాబాల మాటున సేవల పేరుతో సాగుతున్న అకృత్యాలను గుర్తించ డానికి తరతమ భేదం లేకుండా దేశవ్యాప్తంగా ఆశ్రమాలపై నజర్‌ పెట్టాలి. అన్ని ఆశ్రమాలు తమ కార్యకలా పాలను బహిరంగ పరిచేలా ఆదేశించాలి. ప్రజలకు సేవ ముసుగులో అకృత్యాలకు పాల్పడకుండా తరచూ సోదాలు చేయాలి. అవి ఏ మతానికి చెందినవయినా తనిఖీలు చేయాల్సిందే. తనిఖీలను అడ్డుకునే అధికారం లేకుండా ఆచేయాలి. భూ ఆక్రమణలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఉంటే చర్యలు తీసుకోవాలి. గుర్మీత్‌ సింగ్‌ వ్యవహారాలతో ప్రభుత్వాలు మేల్కోవాలి. తనను తాను భగవత్‌ స్వరూపుడుగా సామాన్యుల ను వంచించిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డట్లుగా ఇప్పుడిప్పుడే కథనాలు వస్తున్నాయి. అమ్మాయిలతో సెక్స్‌ వాంఛలు తీర్చుకోవడం, పురుషులను నంపుసంసకులను చేయడం, తమ పాప కృత్యాలకు అడ్డుగా వస్తున్‌ఆనరని గుర్తించిన ఎందరినో హతమార్చడం వంటి చర్యలపై తక్షణం దర్యాప్తు చేయించాలి. అలాగే తీర్పు సందర్భంగా జరిగిన హింసలో జరిగిన మారణకాండకు కూడా డేరాబాబాను బాధ్యుడిని చేసి మరింత కఠిన శిక్షను అమలు చేయాలి. సీబీఐ న్యాయస్థానం దోషిగా ప్రకటించాక ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడడం మాత్రమే సరిపోదు. అన్ని కేసులను ఒకేచోటకు చేర్చి తక్షణ తీర్పును ఇవ్వాల్సిన అగత్యం ఉంది. ఎన్నో అకృత్యాలకు పాల్పడినందున అతడికి ఉరిశిక్ష వేసినా తప్పులేదు. ఇలా చేయడం ద్వారా బాబాల పేరుతో ప్రజలను మోసగించే వారికి ఓ గట్టి హెచ్చరిక చేయాలి. రక్తదానం, నేత్రదానం, మహిళా సాధికారత, స్వచ్ఛత, ఆహార-వస్త్ర బ్యాంకులు, నిర్వాసితులకు గూడు కట్టించడం వంటి సమాజహిత కార్యక్రమాల పేరుతో డేరా ఆశ్రమంలో ఎన్నో అకృత్యాలు చోటు చేసుకున్నాయి. ఎందరో వనితలు తమ శీలాన్ని బలిపెట్టారు. ఎందరో అన్యాయంగా హత్యగావించబడ్డారు. ఎందరో అన్యాయంగా నంపుసంకులయ్యారు. ఇవన్నీ పూర్వాశ్రమంలో రాజులపేరుతో జరిగిన వ్యవహారాలే. రాజుల కాలంలో జరిగిన అకృత్యాలు ఇప్పుడు బాబాల ముసుగులో జరిగాయని డేరా బాబా నిరూపించాడు. తమ డేరాశ్రమం సేవాశ్రమంగా చెప్పే గుర్మీత్‌ అనుయాయులు, అసలు సిసలు అసాంఘిక శక్తులుగా చెలరేగిపోయారు. గుర్మీత్‌పై అనుచరగణాలు చేసిన దాడి కారణంగా అమాయక ప్రజలు అల్లర్లకు 38మంది బలయ్యారు. 2002లో డేరాకు చెందిన సాధ్వి రాసిన ఆకాశరామన్న లేఖ బయటపడకుండా ఉంటే ఇవాళ డేరా అకృత్యాలను గుర్తించే వారం కాదు. హరియాణాలోని సిర్సాలో వెయ్యి ఎకరాల్లో ఉన్న గుర్మీత్‌ ఆశ్రమంలో సేవ చేసేందుకు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ‘సాధ్వి’గా పంపడం ఆనవాయితీ. అలా వెళ్ళిన ఓ బాలిక, గుర్మీత్‌ బెదిరించి తనపై అత్యాచారం చేశాడంటూ పలు రాజ్యాంగ వ్యవస్థలకు 2002లో రాసిన ఆకాశ రామన్న లేఖ తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ లేఖను తీవ్రంగా పరిగణించిన ఉన్నత న్యాయస్థానం సిర్సా జిల్లా సెషన్స్‌ జడ్జి ద్వారా ప్రాథమిక విచారణ జరిపించి, ఆయన సూచన మేరకు కేసు దర్యాప్తు బాధ్యతను 2002 సెప్టెంబరులో సీబీఐకి అప్పగించింది.ఆ లేఖను ప్రచురించిన సంపాదకుడు హతమయ్యాడు. ఫిర్యాదు లేఖ రాసింది ఫలానా సాధ్వి అయి ఉంటుందన్న అనుమానంతో ఆమె సోదరుణ్నీ చంపేశారు. ఆ కేసులూ గుర్మీత్‌ మెడకు ఉచ్చు బిగిస్తున్నాయిప్పుడు! పంజాబ్‌, హరియాణా, దిల్లీ, రాజస్థాన్‌లతోపాటు పలుచోట్లకు విస్తరించిన డేరా ప్రాబల్యం కారణంగా అనేక రాజకయీ పార్టీలు కూడా డేరాస్వామికి దాసోహమన్నాయి. 2009లో హర్యానాలో కాంగ్రెస్‌ కొమ్ముకాసిన డేరా, 2014లో బిజెపి విజయానికి చేయూతనిచ్చింది. ఇలాంటి వారి మద్దతుతో ఏర్పడ్డ ప్రభుత్వాలు కావడం వల్ల్నే డేరాలాంటి వారి అకృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నాయి. గుర్మీత్‌పై కేసులున్నా అతగాడికి ‘జెడ్‌ ప్లస్‌’ కేటగిరీ భద్రత కల్పించిన కారణంగా అతడు చేసే అకృత్యాలు వెలుగు చూడడానికి సమయం పట్టింది. ఇప్పటికైనా రాజకీయా పార్టీలు బాబాల భ్రమల నుంచి బయటపడాలి. బాబాలకు సంబంధించిన కార్యకలాపాలన్నీ వెలుగు చూడాలి. వారికి సంబంధించిన నిధులు మొదలు అన్న వ్యవహారాలను ఆడిట్‌ చేయాలి. డబ్బుల రాక మొదలు ఖర్చుల వరకు నియంత్రణ లో జరిగేలా చూడాలి. ఆశ్రమాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేలా చేయాలి. అమాయక అమ్మాయిలు బలి కాకుండా చూడాలి. ప్రభుత్వాలు మేల్కొని బాబాల కార్యకలాపాలను బట్టబయలు చేస్తే డేరాబాబా లాంటి మోసగాళ్లను అరికట్టవచ్చు. ప్రజల్లో ఉన్న అసమానతలతను తొలగించక పోవడం వల్లనే బాబాలు పుట్టుకుని వస్తున్నారు. అలాగే కులమతాల పేరుతో ప్రజల్లో ఇంకా అస్పృశ్యతను ప్రోత్సహించడం వల్లనే వారు బాబాలను ఆశ్రయిస్తున్నారు. తాము మోసపోయామని తెలుసుకునే సరికి జీవితకాలం ముగిసి పోతోంది. డేరాబాబా కేసును ఉదాహరణగా స్వీకరించి ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమిస్తేనే సమాజాంలో దొంగబాబాలను అరికట్టగలుగుతాం.

———————–