దొంగల ముఠా అరెస్టు
నెల్లూరు, జూలై 20: నెల్లూరులో బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని వస్తున్న వ్యక్తుల దృష్టి మళ్లించి డబ్బు కాజేస్తున్న దొంగల ముఠాను పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ రమణకుమార్ వెల్లడించి వివరాలు… చిత్తూరు జిల్లా నగిరి మండలం ఓజికుప్పం ప్రాంతానికి చెందిన ముత్యాల శ్రీనివాసులు, హనుమంతరావు ఉత్తమన్, గోవిందరావు నరేష్, దామోదరం దీనేష్‌కుమార్ అనే నలుగురు సభ్యుల ముఠా నగరంలోని వివిధ బ్యాంకుల వద్ద తచ్చాడుతూ బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసి వస్తున్న వారి దృష్టి మరల్చి సుమారు 15లక్షల రూపాయల వరకు దోపిడీకి పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. 2011 మార్చి 28న నెల్లూరు నగరానికి చెందిన ఎ.కృష్ణచైతన్య బ్యాంకు నుంచి 3,50 వేల రూపాయలు డ్రా చేసుకొని వస్తుండగా అతడి దృష్టి మరల్చి డబ్బు కాజేశారు. అదే విధంగా 2011 డిసెంబర్‌లో కొండారెడ్డి నుంచి 3,80వేల రూపాయలను మురళీకృష్ణ హోటల్ వద్ద దోచుకొని వెళ్లారు. 2012 జూన్‌లో బుచ్చయ్య అనే వ్యక్తి దృష్టి మరల్చి స్టోన్ హౌస్‌పేటలోని ఎస్‌బిఐ బ్యాంకు వద్ద 95వేల రూపాయలను కాజేశారు. ఈ నెల 17న బార్కాస్ సెంటర్‌లో అరుణ్‌కుమార్ అనే వ్యక్తి 5లక్షలు డ్రా చేసుకొని వస్తుండగా అతని దృష్టి మరల్చి డబ్బు కాజేశారు. కాగా సిసిఐ పోలీసులు దృష్టి సారించి దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 75వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో చొరవ చూపిన సిసిఎస్ పోలీసులను ఎస్పీ రమణకుమార్ అభినందించారు.