ధృడచిత్తంతోనే కష్టాలను అధిగమించగలం

జీవితం అంటే- పోరాటం, నిత్య సంఘర్షణ, ఒకటి నుంచి మరొకటిగా సమస్యలతో ప్రయాణం చేయడం! ప్రతి వ్యక్తినీ ఎన్నో కడగండ్లు చుట్టుముడుతుంటాయి. పదేపదే అదేపనిగా అవి వేధిస్తుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని, స్థిరచిత్తంతో ముందడుగు వేయడమే అతడి కర్తవ్యం. పులిస్వారీ వంటిది జీవితం. ఆ జీవన శార్దూలాన్ని ఒడుపుగా నియంత్రించాల్సింది మనిషే!సజ్జన సాంగత్యం, ధార్మిక అంశాల సత్సంగం, ఉత్తమ గ్రంథపఠనం, సంయమనం వంటివి వ్యక్తిని ఉద్ధరిస్తాయి. అతడు ఆత్మదర్శనం చేసుకోవాలి. అంతర్వీక్షణతో మనోమందిరంలోని పరమాత్మను దర్శించాలి. అందుకే ఈ దేహాన్ని విజ్ఞులు ‘నారాయణుడి నెలవు’గా అభివర్ణించారు. అంతర్యామిది అంతటా ఆవరించి ఉన్న అమేయ అద్భుత శక్తి. అది భగవత్‌ తత్వం. కాళ్లు లేకున్నా, వాయువేగంతో సంచరిస్తుంది. చేతులు లేకపోయినా, ఆపద పాలైన భక్తుణ్ని ఒడిసి పట్టుకుంటుంది. కళ్లు లేనప్పటికీ, ఆ శక్తి తీక్షణ వీక్షణాలతో భక్తలోకాన్ని దర్శిస్తుంది. చెవులు లేకున్నా, వారి ఆర్తిని శ్రద్ధగా ఆలకిస్తుందన్నది- ఉపనిషత్తుల సందేశం.భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో ఉన్నాడు’ అనే జ్ఞానదృష్టి మనిషికి కావాలి. అప్పుడే అతడికి విలువలతో కూడిన జీవనం, ఆధ్యాత్మిక జీవన సరళి సుసాధ్యమవుతాయి. జీవన నౌక అల్లకల్లోలాల్ని దాటి మోక్షతీరం చేరాలంటే, నైతిక సూత్రాలే దిక్సూచి! జీవిత రథం సవ్యంగా సాగాలంటే, సుగుణాలనే గుర్రాలు దృఢంగా ఉండాలి. సమత, మమత అనే రెండు చక్రాల సమన్వయంతోనే బతుకుబండి సాఫీగా ముందుకు వెళుతుంది. ఇకపోతే వ్యక్తిలో సభ్యత, సంస్కారం, సుగుణ సంపద నెలకొనాలి. అప్పుడే జాతి సంస్కరణ, పురోగతి వేగవంతమవుతాయి. జాలి, దయ, కరుణలే మనిషికి సహజ స్వభావాలు. ఇతరుల కష్టాన్ని తనదిగా భావించడం, పరోపకారమే లక్ష్యంగా జీవించడం అతడి విధ్యుక్త ధర్మాలు. పావురాన్ని కాపాడేందుకు తన శరీరభాగం నుంచి మాంసాన్ని కోసి ఇచ్చాడు శిబి చక్రవర్తి. మృత్యువునైనా లెక్కచేయకుండా, తనకు సహజసిద్ధంగా లభించిన కవచ కుండలాల్ని కర్ణుడు దానం చేశాడు. వారి గుణసంపద అంత గొప్పది.ఎదుటివారి కష్టనష్టాల్ని చూసి చలించే వ్యక్తి, వారి సేవలో నిమగ్నుడవుతాడు. సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు. దానికి విరుద్ధంగా- అన్నీ తనకే కావాలన్న స్వార్థం, సంకుచితత్వం పతనానికి దారితీస్తాయి. ఎవరూ తన స్థాయికి ఎదగకూడదనే ఈర్ష్య, అసూయ, ద్వేషం అతణ్ని అధోగతికి చేరుస్తాయి.

————–