నగరంలో కురిసింది వాన!

1

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి ఒక్కరోజులోనే తెలంగాణలో 50 మంది, ఏపీలో 29 మంది మృత్యువాత పడ్డారు. పదేళ్లలో ఏప్రిల్‌ నెలలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఎండల వేడికి జనాలు తల్లడిల్లుతున్నారు.అయితే, ఆదివారం నాడు ఒక్కసారిగా హైదరాబాదులో చిరు జల్లులు కురిశాయి. సూర్యూడు కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. ఎండల వేడికి తట్టుకోలేకపోతుండగా.. చిరుజల్లులు కొంత ఊరట కలిగించాయి.హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. బోడుప్పల్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, అంబర్‌ పేట, నాంపల్లి, కాప్రా, గోషా మహల్‌, ఘటకేసర్‌ తదితర పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. వేసవి తాపానికి అల్లాడుతున్న జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

గాలివాన బీభత్సానికి వాహనాలు ధ్వంసం

గాలివాన బీభత్సానికి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆస్తినష్టం సంభవించింది.కొత్తపేట టెలిఫోన్‌ కాలనీలో ఈదురుగాలుల ధాటికి కారు బానెట్‌ ధ్వంసంకాగా, నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం సెంట్రింగ్‌ కూలి మరో ఐదు కార్లు, రెండు బైకులు, ఒక ఆటో చిత్తయ్యాయి. అదృష్టవశాత్తు నిర్మాణం కాకుండా కేవలం కర్రలు మాత్రమే పడిపోవటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. టెలిఫోన్‌ కాలనీ ప్రధాన రహదారిపైనే ఈ ప్రమాదం సంభవించడంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించే

పనిలో ఉన్నారు.కాగా, ఎండ తీవ్రత ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉంది. అనంతపురం, రామగుండం, నిజామాబాదులలో 45 డిగ్రీలు, హైదరాబాద్‌, భద్రాచలం, కరీంనగర్‌లలో 44 డిగ్రీలు, అదిలాబాద్‌, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, నల్గొండలలో 42 డిగ్రీలు ఉంది.