నల్గొండలో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

3

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయి : వెంకయ్యనాయుడు

నల్గొండ,ఏప్రిల్‌15(జనంసాక్షి): నల్లగొండ జిల్లాలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను పరామర్శించటానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్యనాయుడు కేంద్రం రైతులను అన్ని విధాల కేంద్రం ఆదుకుంటుందని హావిూ ఇచ్చారు. రైతులకు అండగా ఉంటామని భోరోసా ఇచ్చారు. పంటనష్టపోయిన వారిని ఆదుకోవడంతో పాటు, తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.  నల్గొండ జిల్లాలోని భువనగిరి, బీబీనగర్‌ మండలాల్లో దెబ్బతిన్న పంట పొలాలను వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కుందారియా, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు పరిశీలించారు. 30 శాతం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మూసీనదిని ప్రక్షాళన చేసి పరివాహాక ప్రాంతాలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తామని మంత్రి హావిూ ఇచ్చారు. అవసరమైతే ప్రపంచబ్యాంకు నిధులతో మూసీ కాలుష్య ప్రక్షాళన చేపడతామని తెలిపారు.

అకాల వర్షానికి పంట నష్టపోయిన నల్గొండ జిల్లా బీబీనగర్‌ రైతుల పొలాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పరిశీలించారు. మండలంలోని బట్టుగూడెం, గుర్రాలబండి, గంపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి ఆదేశం మేరకు కేంద్రమంత్రులందరూ జిల్లాల వారీగా పర్యటించి, అధికారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని హావిూ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతును ఆదుకోవడంలో ముందున్నాయన్నారు. కలెక్టర్‌ సత్యనారాయణ, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, తదితరులు మంత్రి వెంట పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కొత్తగూడెం పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్గొండలో జరిగిన పంట నష్టంపై కేంద్రమంత్రికి వివరించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని రంగారెడ్డి జిల్లా భాజపా నేతలు కోరారు. ఇదిలావుంటే   మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు పర్యటించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న తమ పంటలను అధికారులు చూసేందుకు రాలేదని శ్రీనివాస్‌నగర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఆర్డీవో కిషన్‌రావు ఆధ్వర్యంలో అధికారులు దెబ్బతిన్న పంటలపై క్షేత్రపరిశీలన జరిపారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ.. వర్షాల వల్ల ఐదు గ్రామాల్లో వెయ్యి ఎకరాలకు పైగా వరి పంట దెబ్బతింది. ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.