కొత్తగూడ అక్టోబర్ 22 జనంసాక్షి:మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రం వద్ద సంతాప సభ నిర్వహించి నారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు.ఉపాధ్యాయ ఉద్యమ వేగుచుక్క,విద్యారంగ పరిరక్షణ కోసం పోరాటాలు చేస్తూ ఉపాధ్యాయుల హక్కులకై అలుపెరగని పోరాట పటిమతో ముందుకు సాగిన ఉమ్మడి రాష్ట్ర యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ మృతి ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంకిత భావం,వృత్తి నిబద్ధత,సమస్యల పట్ల నిజాయితీ,పోరాటం అన్ని కలగలిసిన నారాయణ నేటి తరానికి ఆదర్శనీయుడని పేర్కొన్నారు.నారాయణ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా,అధ్యక్షులుగా,జేఏసీ కో-చైర్మెన్ గా సుదీర్ఘ కాలం పని చేసి ఎన్నో చారిత్రక పోరాటాలకు నేతృత్వం వహించి ఉపాధ్యాయ, ఉద్యోగ చరిత్రలో తనదైన ముద్రవేశారని కొనియాడారు.తుదకంటా నిరాడంబరంగా జీవించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారని,విలువలతో కూడిన ఉద్యమాలను నడిపించారని అన్నారు.పదవి విరమణ అనంతరం కూడా తల్లిదండ్రుల సంఘం ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నో ప్రతినిధ్యాలు చేశారని తెలిపారు.విద్యా రంగం పట్ల ఒక స్పష్టమైన అధ్యయనంతో చాలా దినపత్రికలకు వ్యాసాలు రాసేవారని ఆయన మృతి ప్రభుత్వ విద్యారంగానికి,ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని అన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి యాకుబ్,జిల్లా కార్యదర్శి మల్కం వీరస్వామి,మండల అధ్యక్షులు శ్రీరాములు, ఉపాధ్యాయులు సుబ్బారావు,సాయిలు,రాంచందర్,కొమ్మాలు,శివకృష్ణ,అంజయ్య,నారాయణ,సుంచ శ్రీను తదితరులు పాల్గొన్నారు.