నాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ
చీఫ్ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి చీఫ్ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి .
ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు.శనివారం నాడు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేటు కార్యాలయంలో ప్రభుత్వ వివ్ జాతీయ పతాకావిష్కరణ గావించారు.అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,ప్రియమైన స్వాతంత్ర్య సమర యోధులకు, అమర వీరుల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, కర్షక, కార్మిక, పాత్రికేయులకు, విద్యార్థినీ విద్యార్థులకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ శుభాకాంక్షలు.నేడు ఈ స్వేచ్ఛ, స్వతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణా అభివృద్ధికి నాంది పలికింది అనుకోవాలి. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్‌లో విలీనమై 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో ఈనెల 16 నుంచి 18 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రారంభ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాడు జరిగిన వీరోచిత పోరాటం.. హైదరాబాద్ సంస్థానం విలీనమైన తీరుతెన్నులకు మనందరం ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారు. బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ఇండియా ఇండిపెండెన్స్ యాక్టు సంస్థానాల విషయంలో స్వతంత్రంగా ఉండటం లేదా భారత దేశంలో లేదా పాకిస్తాన్ లో విలీనం కావడానికి అవకాశం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారత దేశంలో విలీనం అయ్యాయి. కానీ జునాఘడ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు. హైదరాబాద్ సంస్థానం రాజు నైజాం స్వతంత్రంగా ఉంటుంది అని ప్రకటించారు. కానీ సంస్థానంలో ప్రజలకు కనీస మానవ హక్కులు లేవు. భూస్వాములు, జమీందార్లు, జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలను పీడించారు. మరోవైపు ప్రైవేటు సైన్యం రజాకార్లు దమనకాండ కొనసాగింది. రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్ర భాగం చెల్లించాల్సి వచ్చింది. 85 శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాష పై అణచివేత కొనసాగింది. కనీస హక్కులు కోసం, దోపిడీ, దౌర్జన్యాలు ఎదిరించిన ప్రజలపై దాడులు, అత్యాచారాలు, దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తమకు స్వాతంత్య్రం లేకపోవడాన్ని హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసమైన ఆయుధం అందుకోక తప్పదని ఆడ, మగ తేడా లేకుండా అన్నివర్గాల ప్రజలంతా సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. పలుగు, పార, కారం, రోకలి, వరిసెల, బరిసేలు ఆయుధాలుగా మారాయి. ఈ పోరాటంలో నాలుగున్నరవేల మంది ప్రాణాలు కోల్పోయినా మడమతిప్పకుండా తెగువ చూపించారు ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసుకొని స్వాతంత్రం కోసం పోరాడారు. ఆంధ్ర మహాసభ ఏర్పాటులో నల్గొండ ప్రాంతానికి చెందిన రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరావు కీలకపాత్ర పోషించారు. అంతకు ముందు నైజాం ఆంధ్ర జన సంఘం ఏర్పాటయింది. ఈ సంఘం రెండో సమావేశం 1924 మార్చి 21న నల్లగొండలో షబ్నవీసు వెంకట రామనరసింహారావు (నీలగిరి పత్రిక సంపాదకుడు) పత్రికా కార్యాలయంలో జరిగింది. ఆంధ్రమహాసభ రెండో మహాసభ దేవరకొండ లో 1931 మార్చి 3, 4, 5 తేదీల్లో జరిగింది. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా పులిజాల వెంకటరంగారావు, ఆహ్వాన సంఘం కార్యదర్శిగా పగిడిమర్రి ఎల్లయ్య, అధ్యక్షుడిగా బూర్గుల రామకృష్ణారావు వ్యవహరించారు. మరోవైపు ప్రజలపై దాడులు పెరగడంతో సామాన్యులు సాయుధ పోరాటం చేపట్టారు. ఇందులో మన నల్గొండ జిల్లా నుంచి బండి యాదగిరి రాసిన బండెనకబండికట్టి పదహారు బండ్లు కట్టి..ఏబండ్లో పోతావు కొడకో..నైజాం సర్కారోడో…పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి నైజాం రాజులపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆరుట్ల కమలాదేవి, రాంచంద్రారెడ్డి, బీంరెడ్డి నర్సింహారెడ్డి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్ల రాంచంద్రారెడ్డి, కట్కూరి రాంచంద్రారెడ్డి, సుశీలా దేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణరెడ్డి, కుర్రారం రాంరెడ్డి, గడ్డమీది రామయ్య, మల్లు స్వరాజ్యం, బద్దం నర్సింహారెడ్డిలతో పాటు మరెందరో వీరులు పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలు కీలకపాత్ర పోషించడం విశేషం. ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ, మల్లుస్వరాజ్యం లాంటి వారు సాయుధ పోరాటంలో తుపాకి చేతబట్టి పోరాటం చేశారు. నల్లగొండ జిల్లా ఈ పోరాటంలో కీలకపాత్ర పోషించింది. నిరంకుశత్వానికి, రజాకార్ల కిరాతక చర్యలకు ఎదురొడ్డిన ప్రాంతం చిట్యాల మండలం గుండ్రాంపల్లి. సూర్యాపేట మండలంలోని బాలెంల, ఇక వేములపల్లి మండలంలోని రావులపెంట కేంద్రంగా సాయుధ రైతాంగ పోరాటం సాగింది. రావులపెంటతోపాటు సమీప గ్రామాల ప్రజలంతా సాయుధ పోరాటంలో భాగస్వాములయ్యారు. పెద్దవూర మండలం ఏనెమీదిగూడెం, తిరుమలగిరి సాగర్ మండలం ఆల్వాల, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం మల్లారెడ్గిగూడెం, మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం, పెదవీడు, చౌటపల్లి, గరిడేపల్లి మండలం వెల్దండ, పొనుగోడు, నేరేడుచర్ల మండలం పెంచికల దిన్నె ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. నాటి సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 వందల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు స్వామి రామానంద తీర్థ పేరుతో పోచంపల్లి లో గ్రామీణ శిక్షణ సంస్థ ఏర్పాటు అయ్యింది. మరోవైపు హైదరాబాద్ సంస్థానం భారతదేశం భూ భాగం మధ్యలో ఉండటం భవిష్యత్ లో సమస్యలకు దారి తీస్తుంది అని భారత ప్రభుత్వం భావించింది. మరోవైపు ప్రజలపై రజాకార్లు, జమీందార్లు దాడులు పెరిగిన నేపథ్యంలో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయభారం పంపారు. తమ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం రంగంలోకి పోలీస్ చర్యకు దిగింది. దీనినే ఆపరేషన్ పోలో అని పిలిచారు. ఓవైపు సాయుధ పోరాటం..మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమిలేక అప్పటి నిజాం భారత యూనియన్ లో విలీనానికి అంగీకరించాడు. 1948 సెప్టెంబరు 17 సాయంత్రం డెక్కన్ రేడియోలో తన లొంగుబాటు ప్రకటించారు. నిజాం లొంగుబాటుతో హైదరాబాద్ భారత దేశంలో విలీనం అయ్యింది. భూమిలేని నిరుపేదలకు భూమిని పంచాలనే ఉద్యమమైనా భూదాన్ ఉద్యమం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పోచంపల్లి నుండే ప్రారంభమైంది. ఈ సెప్టెంబర్ 17తో భారత్ యూనియన్‌లో విలీనమై 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో ఈనెల 16 నుంచి 18తేదీల్లో మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్బంగా హైదరాబాద్ లో కొమరం భీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్ లను ప్రారంభించుకోవడం ఒక శుభపరిమాణం. ఈ సందర్బంగా గిరిజన సోదరీ, సోదరీమణులకు హృదయ పూర్వక అభినందనలు. ఈ సందర్భంగా నేటి తరం నాటి మన పూర్వీకుల త్యాగాలు, బలిదానాలు మననం చేసుకుందాం. నేటి ఈ స్వేచ్చ, స్వాతంత్రం వారి బలిదానాల ఫలితమే. నేటి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది ఆనాటి తరమే. నేటి తరాల ఉద్యమ స్పూర్తితో మరింత అభివృద్ది వైపు గా అడుగులు వేద్దాం. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమo కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మనము స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బాoగా వివరించడo జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్ళి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికి అందేటట్లు చేయడానికి సహకరిస్తున్న గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, బ్యాంకర్లకు మరియు శాంతి భద్రతలు పరిరక్షిస్తున్న పోలీస్ అధికారులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు మరియు విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు తెలియచేస్తూ ఇదే స్పూర్తితో అందరము కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదాo. ఆ దిశలో మనమoదరం అంకితమై శ్రమిస్తూ. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం.