నాపై నమ్మకం లేదా?!

3

– తప్పుకుంటాను

– జానా సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): తనపై కొందరు అదేపనిగా దుష్పచ్రారం చేస్తూ తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానంటూ ప్రచారం చేయడంపై సిఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. దీనిని పార్టీ నేతలు కొందరు ఖండించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన నాయకత్వంపై నమ్మకం లేకపోతే తప్పుకుంటానని కూడా హెచ్చరించారు. గురువారం జరిగిన సిఎల్పీ భేటీలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జానా వ్యాఖ్యలతో ఉత్తమ్‌తో సహా అంతా అవాక్కయ్యారు. టీఆర్‌ఎస్‌కు  అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే అధికార పార్టీలో చేరతారని సొంత పార్టీ శ్రేణులే కామెంట్లు చేస్తుండటంపై  జనారెడ్డి ఘాటుగా స్పందించారు. తాను టీఆర్‌ఎస్‌ లోకి వెళుతున్నాననే వార్తలు పీసీసీ ఆఫీస్‌ బేరర్లే రాయించారని మండిపడ్డారు. తనపై నమ్మకం లేకుంటే సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటానన్నారు.  హైదరాబాద్‌ లో జరిగిన సీఎల్పీ భేటీలో జానారెడ్డి ప్రసంగం.. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను కలవరపాటుకు గురిచేసింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే సీఎల్పీ నేతగా నేను వెంటనే ఖండిస్తా. అలాంటిది చాలా రోజులుగా నాపై సాగుతోన్న దుష్పచ్రారాన్ని ఎవ్వరూ ఖండించలేదు. నేను టీఆర్‌ఎస్‌ లో చేరుతానంటూ వచ్చిన వార్తలను ఉత్తమ్‌ కుమార్‌ ఖండించి ఉండాల్సింది. నిజానికి పీసీసీ ఆఫీస్‌ బేరర్లే ఆ వార్తలు రాయించారు. నా నాయకత్వంపై నమ్మకం లేకుంటే చెప్పండి.. సీఎల్పీ పదవి నుంచి తక్షణమే తప్పుకుంటా’ అని జానారెడ్డి ఎమ్మెల్యేలతో అన్నారు. ఒక్కసారిగా సీఎల్పీ నేత అలా మాట్లాడటంతో విస్తుపోయిన ఎమ్మెల్యేలు.. క్షణాలపాటు బిత్తరపోయి, వెంటనే తేరుకున్నారు. ‘విూరే మా నాయకుడిగా ఉండాలి’ అని మూకుమ్మడిగా జనారెడ్డిని విజ్ఞప్తిచేశారు. ఆ తరువాత సాగునీటి ప్రాజెక్టులపై ఇవ్వాలనుకున్న పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఆలస్యం అవుతుండటంపై సీఎల్పీ చర్చించింది. వీలైనంత తొందరగా ప్రెజెంటేషన్‌ కు ఏర్పాట్లు పూర్తిచేయాలని

పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సమావేశానికి హాజరైనవారిలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, గీతా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్‌ రెడ్డి, పద్మావతి, జీవన్‌ రెడ్డి, భాస్కర్‌ రావు, సంపత్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. ఇదిలావుంటే పాలేరు ఉప ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల వేతనాన్ని రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి విరాళంగా ఇవ్వాలని తెలంగాణ సీఎల్పీ  నిర్ణయించింది.  పాలేరు ఉప ఎన్నికల ఖర్చు, పార్టీ ఫిరాయింపులపై ఈ సమావేశంలో ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ మారడంపై చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తమతో చర్చించారని సీఎల్పీ నేత జానారెడ్డికి సమావేశంలో ఎమ్మెల్యేలు సంపత్‌, వంశీచంద్‌రెడ్డి తెలిపారు. విషయాన్ని ముందుగానే చెప్పివుంటే పార్టీ మారకుండా రామ్మోహన్‌రెడ్డిని ఆపేవాళ్లమని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఇదే సమావేశంలో పార్టీ ఫిరాయింపులపై  చర్చించారు. కాగా సమావేశానికి ఎమ్మెల్సీలను పిలవలేదని పొంగులేటి అలక పాన్పుఎక్కారు. దీంతో సమావేశానికి రావాల్సిందిగా పొంగులేటిని జానా, షబ్బీర్‌ కోరారు. మరోవైపు నల్గొండ డీసీసీ అధ్యక్షుడి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. 6 నెలలుగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడి జాడ లేదని, ఇలా అయితే పార్టీని ఎలా నడిపిస్తామని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కరువు కాటేస్తుంటే ప్లీనరీ పెట్టుకోవాల్సిన అవసరం టీఆర్‌ఎస్‌కు  ఏమి వచ్చింది? అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ నేతలకు నామినేటెడ్‌ పదవులని హావిూలిచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా డిమాండ్‌ చేశారు. పాలమూరులో ఆర్డీఎస్‌ పనులను ప్రారంభించాలన్న డిమాండ్‌తో  మే 9న కాంగ్రెస్‌ ధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. అన్ని జిల్లాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం సమగ్ర జల విధానాన్ని ప్రకటించాలని చెప్పారు. ఎఫ్‌ఆర్బీం పరిమితిని పెంచినా, రంగారెడ్డి జిల్లాలో భూములను విక్రయించినా ఇంకా కేసీఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు రైతుల రుణాలను మాఫీ చేయడం లేదంటూ దుయ్యబట్టారు. ఖమ్మంలో ఓటమి పాలైన టీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు పాలేరులో చెల్లుతారా? అంటూ ఎద్దేవా చేశారు. పాలేరు కాంగ్రెస్‌ కోసం విరాళంగా సీఎల్పీ ఒక నెల వేతనాన్ని ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలేరు ఉప ఎన్నిక వ్యయం కోసం పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కొనసాగుతోందని ఎమ్మెల్యేరామ్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.