నాలుగేళ్లలో ప్రజల కన్నీరు తుడవలేక పోయిన మోడీ పాలన
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల అధికారాన్ని పూర్తి చేసుకోబోతోంది. సరిగ్గా మే26న ఆయన పదవి చేపట్టారు. పార్లమెంట్ గడపకు మొక్కిప్రధానిగా అడుగుపెట్టారు. ప్రధానిగానే పార్లమెంట్ గడప దోక్కిన ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు పాలన చేసి బహుళ ప్రజాదరణ పొందారు. బిజెపికి ఉన్న ఇమేజ్, గుజరాత్ నమూనా, కాంగ్రెస్ పదేళ్ల పాలనా వైఫల్యాలు మోడీకి కలసి రావడంతో ఆయన ప్రధానిగా పెద్ద విజయమే సాధించారు. పార్లమెంటులో అడుగుపెట్టేముందు తాను ఏం చేసిందీ మళ్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని మోడీ ప్రకటించారు. అయితే తాను ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలను అమలు చేశానా లేదా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రోగ్రెస్ రిపోర్టు ఎవరికి వారు ఇచ్చుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో కుదరదు. ప్రజలు పాలనాతీరును బేరీజు వేసుకుని భేష్ అనుకుని రిపోర్టు ఇస్తేనే అప్పుడు దానికి ఆదరణ ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు మోడీ ఈ పరిశీలన చేసుకుని ముందుకు సాగివుంటే నాలుగేళ్లలో అద్భుత భారతం ఆవిష్కృతం అయ్యేది. కానీ మోడీ నిరంకుశ విధానాల కారణంగా ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా ఈతిబాధలు అనుభవిస్తున్నారు. బ్యాంకులు దివాళా తీసాయి. ఆర్థిక ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ధరలు అదుపులేకుండా పోతున్నాయి. కొనబోతే కొరివి..అమ్మబోతే అడివి అన్న చందంగా తయారయ్యింది. రైతులు పండించిన ధాన్యానికి రెట్టింపు ధరలు వచ్చేలా చేస్తామన్న హావిూ అమలు చేయలేకపోయారు. నదుల అనుసంధానం వాగ్దానం గానే మిగిలింపోయింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో గంగా ప్రక్షాళన ఇంచు కూడా ముందుకు కదల్లేదు. దీనికితోడు బిజెపికి ఉన్న ఇమేజ్ కూడా గంగలో కలసిపోయింది. బిజెపి సీనియర్లను అనవసరంగా పక్కన పెట్టారు. దేశంలో జరుగుతున్న ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని వారిని సంప్రదించడం ద్వారా దేశానికి మంచి చేద్దామన్న ఆలోచనకూడా చేయలేదు. దేశ జనాభాలో 60కోట్ల మంది మధ్యతరగతి ప్రజలే. ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాల ప్రభావం తొలుత వారివిూదే పడుతుంది. పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు వారిని ఈ నాలుగేళ్ల కాలంలో ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎల్‌పీజీపై సబ్సిడీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం భావించి దానికి అనుగుణంగానే ప్రతినెలా సిలిండరుకు రూ.4 మేర పెంచడంతో ఇప్పుడది భారంగామారింది. 2018 మార్చినాటికి మొత్తం సబ్సిడీని తీసివేయాలని ప్రభుత్వం చమురు కంపెనీలకు సూచించింది. దాంతో సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర నాలుగేళ్లలో విపరీతంగా పెరిగింది. అందుకే బిజెపి వచ్చినా దేశం బాగుడపదన్న భావన ప్రజల్లో బలంగా నాటుకు పోవడానికి మోడీ అనుసరించిన విధానాలే కారణంగా చెప్పుకోవాలి. మోడీ కొలువుతీరి శనివారం నాటికి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఒక ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి నాలుగేళ్ల సమయం తక్కువేవిూ కాదు. దీనికి ప్రాతిపదిక ఏంటన్నది ప్రస్తుతం ప్రజలు అనుబవిస్తున్న కష్టాలు..గత ప్రభుత్వాలు అనుసరించిన తీరు బేరీజు వేసుకుంటే అభివృద్ది జరిగిందా లేదా అన్నది చెప్పవచ్చు. ఆర్థిక ప్రగతి..లెక్కలు, అంతర్జాతీయ ప్రభావాలు అన్నవి సామాన్యులకు అక్కర్లేదు. చేయగలిని పనులైనా చేశారా లేదా అన్నదే ముఖ్యం.పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు అన్నది ఆర్థికంగా ప్రజలను దెబ్బతీసింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ మధ్యతరగతిని తీవ్రంగా దెబ్బకొట్టింది. నల్లధనాన్ని తుడిచిపెట్టి, ప్రజలను నగదు లావాదేవీల నుంచి డిజిటల్ లావాదేవీలకు మళ్ళించే లక్ష్యంతో 2016 నవంబరులో తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం నిర్దేశిత లక్ష్యాలు సాధించలేకపోయింది. అందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులే నిదర్శనం. ఆ పరిణామం కారణంగా దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 19.5శాతం పెరిగిన మాట నిజం. అయితే నల్లధనం
తగ్గుముఖం పట్టిందనేందుకు సరైన ఆధారాలే లేవు. నగదు కొరత దేశ ప్రజలను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టింది. మరోవంక గ్రామాల్లో చాలినన్ని బ్యాంకు శాఖలు, ఏటీఎంలు లేకపోవడమూ గ్రావిూణ ప్రజలను తీవ్ర ఇబ్బందులపాలు చేసింది. నోట్ల రద్దు, ప్రతి సేవకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి వంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగి ఉండవచ్చు.. కానీ ఇది అభివృద్దికి ప్రాతిపదిక కాదు. మొత్తవ్మిూద ఈ నాలుగేళ్ల కాలావధిలో మోదీ ప్రభుత్వం కారణంగా నాలుగేళ్లలో భారతీయ మధ్యతరగతి ప్రజలకు చేదుగుళికలే తినిపించింది. వారు ఆశించిన ప్రభుత్వం వచ్చిందన్న భావనలో లేరు. ఇంతగా దారుణంగా ఉంటుందని అనుకోలేదు. మొత్తంగా నాలుగేళ్లు పెద్దగా ప్రజలకు ఒరిగిందేవిూ లేదనే చెప్పవచ్చు. ప్రజలు ఆశించిన పాలన మాత్రం అందలేదు. బిజెపిపై పెట్టుకున్న ఆశలను ఓ రకంగా మోడీ దెబ్బతీశారనే చెప్పాలి. ఎన్నో ఆశలను కల్పించిన మోడీ కూడా పరిస్థితులను అవగాహన చేసి ముందుకు సాగడం లేదు. దీంతో దేశంలో అనేకానేక సమస్యలు ఇంకా అలాగే ఉండిపోయాయి. ప్రజల జీవితాలుమాత్రం పెనం విూంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. మరో ఏడాది గడువు మాత్రమే ఉండగా అనేక విజయాలు సాధించామని మోడీ అనుకుని ఉంటున్నారు. అవి ఆయన కోణంలో చూస్తే సరైనవే అయినా, పాలన అన్నది ప్రజల కోణంలో చూడాలి. ప్రజలు తమ జీవితాలు బాగుపడ్డాయన్న ఆనందం వ్యక్తం చేయాలి. అప్పుడే విజయం సాధించామని చెప్పడానికి గీటురాయిగా ఉంటుంది.