నాసిరకం మందులు కొనొద్దు

5

– వైద్య,ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 6(జనంసాక్షి):ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరులో గణనీయమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అధికారిక నివాసంలో సీఎం వైద్య, ఆరోగ్య శాఖపై సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు, ఆస్పత్రుల పనితీరుపై సీఎం అధికారులతో చర్చించారు. ప్రజావైద్యాన్ని మెరుగుపర్చడానికి బడ్జెట్‌లో అధిక నిధులను కేటాయించామని..ఆస్పత్రుల సూపరింటెండెంట్‌ల అధికారాలు, నిధులు బదలాయించినందున ఆస్పత్రుల్లో మెరుగైన మార్పులు తేవాలని ఆదేశించారు.ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు వెంటనే అధికారాలను బదిలీ చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీ నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకు సూపరింటెండెంట్లకు నిర్వహణ నిధులు ఖర్చు చేసే విచక్షణాధికారం ఇవ్వాలని సూచించారు. అన్ని ఆస్పత్రుల్లో కొత్త బెడ్స్‌,బెడ్‌ షీట్స్‌,పరుపులు వెంటనే కొనాలని ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల మెడికల్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. హెల్త్‌ మిషన్‌ ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.లక్ష ఇస్తున్నట్టు తెలిపారు. వాటితో పీహెచ్‌సీల బాధ్యతను మెడికల్‌ ఆఫీసర్లు నిర్వహించాలని సూచించారు.ఉస్మానియా ఆస్పత్రిలో పేషెంట్ల సహాయకుల కోసం బహుళ అంతస్తుల బిల్డింగ్‌ నిర్మించాలని సూచించారు. టీచింగ్‌ ఆస్పత్రుల సూపరింటెండెంట్లను కనీసం రెండేళ్లు ఒకే చోట పనిచేసేలా ఫిక్స్‌డ్‌ టైం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి అన్నీ మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మందుల కొనుగోలు అధికారం మెడికల్‌ ఆఫీసర్లకే అప్పగించాలని..ఇందు కోసం రాష్ట్ర స్థాయిలో రేట్‌ కాంట్రాక్ట్‌ నిర్ణయించాలని నిర్దేశించారు. నాసిరకం మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయొద్దని సూచించారు.జిల్లాకు 2 చొప్పున మందుల సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హెచ్‌వోడీలకు ఏడాదికి రూ.2కోట్లు,ఉస్మానియా, గాంధీ ఆస్పత్రలు సూరింటెండెంట్లకు రూ.కోటి ఖర్చుపెట్టే అధికారం ఇచ్చినట్టు తెలిపారు. వారు జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో అత్యవసర పనులను చేయాలని సూచించారు. గ్రావిూణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు సవిూప పట్టణంలో నివాసముండే వెసులు బాటు కల్పించాలని సూచించారు.