నా భర్త మంచివాడు

5
– కౌన్సిలింగ్‌ తర్వాత మెత్తబడ్డ మధుప్రియ

హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి):గాయని మధుప్రియ ప్రేమ పెళ్లి వివాదం డ్రామాకు 24 గంటల తర్వాత తాత్కాలికంగా తెరపడింది. హుమయూన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్లో మధుప్రియ, శ్రీకాంత్‌ దంపతులకు పోలీసులు, మానసిక వైద్యుల సమక్షంలో 4 గంటల పాటు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్‌ అనంతరం ఇద్దరు ప్రస్తుతానికి రాజీకొచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల తర్వాత సెకండ్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. శ్రీకాంత్‌ కు అయిన గాయాల వివాదంపై మాట్లాడుతూ.. ఉప్పల్‌ పీఎస్‌ పరిధిలో ఈ కేసు ఉందని పేర్కొన్నారు.  మధుప్రియ, శ్రీకాంత్‌ పూర్తిగా రాజీకొస్తారని భావిస్తున్నారా అని ఓ విలేకరి పోలీసులను ప్రశ్నించగా.. అది వారిద్దరికి సంబంధించిన వ్యవహారమని ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. రెండో కౌన్సెలింగ్‌ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సింగర్‌ మధుప్రియ చెప్పింది. అయితే, తనకు కొద్దిరోజుల సమయం కావాలని కోరినట్లు ఆమె పేర్కొంది. రెండో కౌన్సెలింగ్‌ పూర్తయ్యే వరకు తన తల్లితండ్రులతోనే ఉండబోతున్నట్లు వివరించింది. ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్‌ తర్వాత శ్రీకాంత్‌ పై అభిప్రాయం అడగగా… ‘హి ఈజ్‌ గుడ్‌’ అంటూ మధుప్రియ చెప్పింది . మధుప్రియ వస్తానంటే తన ఇంటికి తీసుకెళ్లాడానికి తనకేమాత్రం అభ్యంతరం లేదని శ్రీకాంత్‌ అంటున్నాడు. అయితే, భవిష్యత్తులో ఆమె తల్లిదండ్రులు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని శ్రీకాంత్‌ చెప్పాడు. శనివారం అర్ధరాత్రి నుంచి ఒకరు మరొకరిపై కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. తనను వేధిస్తున్నాడని మధుప్రియ, తనపై దాడి చేశారని శ్రీకాంత్‌ పరస్పరం ఫిర్యాదులు చేశారు.కౌన్సెలింగ్‌ అనంతరం మధుప్రియ విూడియాతో మాట్లాడుతూ… ‘శ్రీకాంత్‌ మంచోడే. అతడిపై ఇప్పుడే ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దు. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి బాగాలేదు. కౌన్సిలింగ్‌తో జీవితమంటే నాకో క్లారిటీ వచ్చింది. శ్రీకాంత్‌ మంచిగా మారితే రెండో కౌన్సిలింగ్‌కు వస్తా. అప్పటివరకు అమ్మానాన్నతోనే కలసి ఉంటా’ అన్నారు. ‘మధుప్రియను వేధించలేదు. ఎప్పటికైనా ఆమె నాతోనే ఉంటుంది. ఆమెతో ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూడా వారి తల్లిదండ్రులు మాట్లాడించ లేదు’ అని శ్రీకాంత్‌ చెప్పారు.కాగా, ఆదివారం తెల్లవారుజామున శ్రీకాంత్‌ 15 మంది అనుచరులతో వచ్చి రామంతాపూర్‌లోని తమ ఇంటిపై ఇటుకలతో దాడి చేశాడని మధుప్రియ తండ్రి పెద్ద మల్లేశ్‌ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌ వల్ల తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 147, 148, 506 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కాగా, మధుప్రియ కుటుంబసభ్యులే ఇంటికి పిలిపించి మరి తనను చితకబాదారని శ్రీకాంత్‌ సాక్షి టీవీ చర్చలో వెల్లడించారు. ఆమె తల్లి వల్లే ఈ గొడవలన్నీ అని చెప్పారు. ఇదే చర్చలో మధుప్రియ మాట్లాడుతూ… అసభ్య పదజాలంతో దూషించేవాడని, చేయి కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు.