నా భర్త వేధిస్తున్నాడు

A

– కేసు పెట్టిన మధుప్రియ

హైదరాబాద్‌,మార్చి12(జనంసాక్షి):’ఆడపిల్లనమ్మ’ అంటూ వెలుగులోకి వచ్చిన వర్ధమాన గాయని మధుప్రియ వైవాహిక జీవితంలో అప్పుడే విభేదాలు వచ్చినట్టు కనిపిస్తోంది. భర్త శ్రీకాంత్‌ తనను వేధిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించారు. భర్తకు వ్యతిరేకంగా హుమయున్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. నాలుగు నెలల క్రితమే మధుప్రియ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మధుప్రియ ఒక్కరే పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ ఆమె వెంట పోలీసుస్టేషన్‌కు రాలేదు. ప్రేమవివాహం చేసుకున్న ఈ జంట మధ్య అతికొద్దికాలంలోనే విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఆర్థిక అంశాలు, కుటుంబపరమైన అంశాల విషయంలో మధుప్రియ-శ్రీకాంత్‌ మధ్య గొడవలు వచ్చినట్టు చెప్తున్నారు. ఈ గొడవలు తీవ్రస్థాయికి చేరడంతోనే మధుప్రియ స్వయంగా పోలీసు స్టేషన్‌ కు ఫిర్యాదు చేసి ఉంటుందని, ఇది ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని  సూచిస్తోందని సన్నిహితులు చెప్తున్నారు. ఇద్దరి మధ్య గొడవకు ప్రధాన కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులను కూడా పోలీసు స్టేషన్‌ కు పిలిపించి వారి సమక్షంలో మధుప్రియను కుటుంబ కలహాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. నాలుగు నెలల కిందట నాటకీయ పరిణామాల మధ్య వర్ధమాన గాయని మధుప్రియ ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన తల్లిదండ్రులకు ఇష్టంలేకున్నా, వారిని ఎదిరించి శ్రీకాంత్‌ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. అతన్ని తాను ప్రేమించానని, తమ వివాహం చేయించాలని ఆమె అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. మధుప్రియ తల్లిదండ్రులు సుజాత-మల్లేష్‌ ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల జోక్యంతో వీరి పెళ్లి జరిగింది.

శ్రీకాంత్‌ బాగా టార్చర్‌ పెట్టాడు: మధుప్రియ

తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్‌ నాలుగు నెలలకే అసలు స్వరూపం బయటపెట్టుకున్నాడని, తనను తీవ్రంగా టార్చర్‌ పెట్టి.. కొట్టాడని వర్ధమాన గాయని మధుప్రియ తెలిపారు. హుమయూన్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ లో భర్తపై వేధింపుల కేసు పెట్టిన ఆమె శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. అమ్మనాన్నను ఎదిరించి.. మనస్ఫూర్తిగా ఇష్టపడి, ప్రేమించి శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకున్నానని, అతను తనను డబ్బుల కోసం వాడుకుంటాడని అనుకోలేదని తెలిపారు. ఆడపిల్లలు ప్రేమించినా అమ్మనాన్నలు ఓకే అంటేనే పెళ్లి చేసుకోవాలని, వారిని ఎదిరించడం సరికాదని ఆమె అన్నారు. అమ్మనాన్న మనస్సు నొప్పించినందుకు వారికి ఆమె క్షమాపణలు చెప్పారు. శ్రీకాంత్‌ తనను బాగా కొట్టాడని, ఈ నాలుగు నెలల కాలంలోనే ఇంటి నుంచి డబ్బు తీసుకురావాలని వేధించాడని తెలిపారు.తాగి తాందనాలు ఆడితూ.. తల్లి, చెల్లి, భార్య అన్న భేదం తెలియని ఇలాంటి వ్యక్తులు భూమివిూద బతికి వేస్ట్‌ అని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేసినా తప్పులేదని ఆవేదనగా మాట్లాడారు. నువ్వు గలీజుదానివని విూడియాకు చెప్తావని శ్రీకాంత్‌ బెదిరించేవాడని, తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకురమ్మని తనను వేధించాడని మధుప్రియ తెలిపారు. తనను తలపై కొట్టినందుకు ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థంకాని స్థితిలో ఉన్నానని, ఓసారి ఆస్పత్రి పాలు కూడా అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల గురించి ఏం తెలియనప్పుడే పాటలు పాడానని, ఇప్పుడు వారు అనుభవించే క్షోభ తెలిసినదానిగా ఆడపిల్లల గురించి మరిన్ని పాటలు పాడుతానని మధు ప్రియ తెలిపారు. ఉదయం నుంచి ఏవిూ ఆహారం తీసుకోకపోవడంతో మధుప్రియ సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం వైద్య పరీక్షల కోసం మధుప్రియను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు శ్రీకాంత్‌ విూదే కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.