నిప్పులు చిమ్ముతూ..నింగికి..

1

– ఇస్రో చరిత్రలో మరోమైలురాయి

– పీఎస్‌ఎల్‌వీసీ-32 వాహకనౌక ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట,మార్చి10(జనంసాక్షి):భారత అంతరిక్షంలో మరో విజయం నమోదయ్యింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. ఇస్రో వరుస వియాలతో దూసుకుని పోతోంది. దిశా నిర్దేశ వ్యవస్థకు సంబంధించిన ఆరో ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్‌) నుంచి గురువారం సాయంత్రం 4 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ 32 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. దేశంలోని ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థలో ఇది మరో మైలురాయిగా నిలవనుంది. 44.4 విూటర్ల పొడవు, 1,425 కేజీల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ అనే ఉపగ్రహాన్ని తీసుకెళ్లి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నావిగేషన్‌ వ్యవస్థపై పనిచేసేందుకు వీలుగా ఇస్రో 2013లో తొలిసారిగా ఓ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అదే ఇండిపెండెంట్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌). ఈ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటివరకు ఆరు

ఉపగ్రహాలను ప్రయోగించింది. మార్చి నెలాఖరు నాటికి నావిగేషన్‌ వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ -సీ32ను ఇవాళ సాయంత్రం 4 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. ఆ వాహకనౌక ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఆ ఉపగ్రహం నావిగేషన్‌కు ఉపయోగపడనుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం సుమారు 1425 కిలోల బరువుంది. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇది ఆరవ నావిగేషన్‌ శాటిలైట్‌ కావడం విశేషం. ఇస్రో చైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ మిషన్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. పీఎస్‌ఎల్వీ ప్రయాణాన్ని శాస్త్రవేత్తలు ఇస్రో కేంద్రం నుంచి ప్రతి క్షణం సవిూక్షించారు. ప్రతి దశలోనూ పీఎస్‌ఎల్వీ దిశను క్షుణ్ణంగా పరీక్షించారు. 1200 సెకన్లకు పీఎస్‌ఎల్వీ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. వచ్చే నెలలో ఇస్రో శాస్త్రవేత్తలు మరో నావిగేషన్‌ శాటిలైట్‌ను ప్రయోగించనున్నారు. దీంతో స్వదేశీ జీపిఎస్‌ మరింత పటిష్టంకానుంది. జనవరి 20వ తేదీన చివరి పీఎస్‌ఎల్వీని ప్రయోగించారు. కేవలం 50 రోజుల తేడాలోనే ఇస్రో టీమ్‌ మరో ఉపగ్రహాన్ని ప్రయోగించడం విశేషం. మిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్‌ కిరణ్‌ కంగ్రాట్స్‌ తెలిపారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం సర్వీస్‌ ఏరియాలో ఉన్న ప్రాంతాలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. దాంతో పాటు అదనంగా మరో 1500 కిలోవిూటర్ల విస్తీర్ణం వరకు కూడా ఉపగ్రహాం సమాచారాన్ని చేరవేయగలదు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అప్లికేషన్లు వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. పర్వత ప్రాంతాలు, ఆకాశ మార్గం, సముద్రాల్లో నావిగేషన్‌కు ఉపకరిస్తాయి. వాహనాలను ట్రాక్‌ చేస్తాయి. సముద్రాల్లో యుద్ధ నౌకలకు దిశానిర్దేశం చేస్తాయి. ట్రావలర్స్‌తో పాటు పర్వతారోహణ చేసేవాళ్లకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అప్లికేషన్లు ఉపయోగపడుతాయి. విపత్తు సంక్షోభ సమయంలో, మొబైల్‌ ఫోన్లతో అనుసంధానం, మ్యాపింగ్‌, జియోడేటా అందిస్తాయి. అప్లికేషన్ల వల్ల డ్రైవర్లకు విజువల్‌, వాయిస్‌ నావిగేషన్‌ సమాచారం అందిస్తాయి.