నిప్పులు చెరిగిన హైదరాబాద్ భగ్గుమన్న ఓయూ.
ఇందిరాపార్కు వద్ద తీవ్ర ఉత్రిక్తత అరెస్టు
హైదరాబాద్, జనవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ భగ్గుమంది! తెలం’గానం’ మిన్నంటింది.. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకొనేందుకు మరిన్ని చర్చలు అవసరమన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఉద్యమం ఉద్ధృతమైంది. రాజధాని నగరం రణరంగమైంది.. నినాదాలు, ఆందోళనలతో హైదరాబాద్ ¬రెత్తింది. ముట్టళ్లు, కట్టళ్లతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజ్‌భవన్, అసెంబ్లీ, ఇందిరాపార్కు, గన్‌పార్కు, ఉస్మానియా యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని రాజ్‌భవన్, అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ వాదులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లారు. వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. విద్యార్థులను అరెస్టు చేసి పోలీసులస్టేషన్‌కు తరలించారు. అటు టీఆర్‌ఎల్డీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తెలంగాణ నినాదాలు చేస్తూ.. బారికేడ్లను తొలగించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. వారిని ప్రతిఘటించి ముందుకు వెళ్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఇందిరాపార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇందిరాపార్కు నుంచి గన్‌పార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు బయల్దేరారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఖాకీలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడంతో విద్యార్థులు ఎదురుతిరిగారు. దీంతో వారిపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు, తెలంగాణ విద్యార్థుల ఆందోళనలతో అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత ఏర్పడింది. టీఆర్‌ఎల్డీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. జైతెలంగాణ నినాదాలు చేస్తూ బారికేడ్లను తొలగించి అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు నిలువరించారు. వారిని అరెస్టు చేసి, స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. తెలంగాణ వాదులు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం విడతల వారీగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. బారికేడ్లను, ముళ్లకంచెలను తొలగించుకుంటూ ముందుకెళ్లారు. అయితే, ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు పోలీసులు వారిని మధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణపై ప్రకటనకు మరింత సమయం పడుతుందన్న కేంద్ర ప్రకటనపై తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. సోమవారం ఉదయం నుంచే రోడ్డెక్కారు. రెండో రోజూ ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓయూ నుంచి ఇందిరాపార్కు వరకు శాంతి ర్యాలీ తలపెట్టారు. అయితే, పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని విద్యార్థులను ఎన్‌సీసీ గేట్ వద్దే అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా వెళ్తామని విద్యార్థులు విన్నవించారు. అయినా పోలీసులు అనుమతించ లేదు. దీంతో విద్యార్థులు ముందుకు వెళ్లేందుకు యత్నించారు. జైతెలంగాణ నినాదాలు చేస్తూ బారికేడ్లను తొలగించి దూసుకెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలతో దొరికిన వారిని దొరికినట్లు చావబాదారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు. మరోవైపు, నిజాం కళాశాలలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీగా గన్‌పార్క్‌కు వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. వారిపై పోలీసులు లాఠీచార్జి చేసి చితకబాదారు. 30 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ట్యూషన్‌కు వెళ్తున్న తమపై దౌర్జన్యం చేసి చావబాదారని విద్యార్థులు మండిపడ్డారు.