నిప్పుల జడివాన

C

పిట్టల్లా రాలుతున్న ప్రాణాలు

పదేళ్ల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు

హైదరాబాద్‌,మే23(జనంసాక్షి): ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో భానుడు నిప్పుల జడివాన కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు జనం వడదెబ్బకు గురై పిట్టల్లా రాలిపోతున్నారు. శనివారం  ఖమ్మంలో అత్యధికంగా రికార్డుస్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1947లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 68 ఏళ్ల తర్వాత ఖమ్మంలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందులలో ఎండల తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యగా సింగరేణిలో కార్మికులు అల్లాడుతున్నారు.  ఒక్క ఖమ్మంలోనే వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో ఇవాళ ఉదయం వరకు30మంది మృతిచెందారు. మరో రెండ్రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. శనివారం నమోదైన ఉష్ణోగ్రతలు ఉత్తర, వాయువ్య దిశల నుంచి వేడి గాలుల వల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

వడదెబ్బకు కరీంనగర్‌లో ఏడుగురు, నల్గొండలో ముగ్గురు, నిజామాబాద్‌; ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున, ఖమ్మంలో ఇద్దరు, మెదక్‌, వరంగల్‌లో ఒకరు చొప్పున మృతి చెందారు. మెదక్‌ జిల్లాలో ఎండవేడిమికి ప్రజలు అల్లాడుతున్నారు.  గత రెండు మాసాలుగా వడదెబ్బతో 14 మంది కూలీలు మృతి చెందారని  డ్వామా పీడీ రవీందర్‌ చెప్పారు. ఉపాధి కూలీలకు వెసలుబాటు ఇచ్చామని అన్నారు. వీరిలో ఎవరికీ ఇంకా పరిహారం అందలేదని, త్వరలో ఇస్తామని స్పష్టంచేశారు. ఉపాధిహావిూ పథకం పనులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 144 మంది మృతిచెందగా వీరిలో 125 మందికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేశారు. జిల్లాలో గత వారం రోజులుగా వడదెబ్బతో ఉపాధిహావిూ కూలీలు మృతి చెందుతున్న నేపథ్యంలో పనివేళల్లో మార్పులు చేశారు. జిల్లాలో కూలీలు ఉదయం 6 నుంచి 10 గంటల్లోపు ఈ పనులు ముగించుకోవాలని సూచించారు. పని స్థలాల్లో నీడ, ప్రథమ చికిత్స కిట్లు ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వృద్ధులు, పిల్లల తల్లులు, ఎండ తీవ్రత తగ్గే వరకు పనులకు దూరంగా ఉండాలని కోరారు. ప్రథమచికిత్స కిట్లు, మందులు లేకుంటే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు నీడ కోసం 20 వేల కిట్లు, ప్రథమ చికిత్స కిట్లు 38 వేలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు.

గత మూడ్రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. ఉత్తర వాయువ్య దిశల నుంచి వేడిగాలుల వల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వడగాల్పులతో జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండలు భగ్గుమంటున్నాయి. వడదెబ్బతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 17మంది మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప జిల్లాలో ఒకరు మృతి చెందారు.  భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరగడంతో రెండు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారాయి. నాలుగు రోజులుగా ఎండ తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వడగాల్పులకు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. మరో రెండు రోజుల పాటు47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  నిన్నఒక్కరోజు వడదెబ్బకు ఏపీలో 204 మంది, తెలంగాణలో 223 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఎండలకు  వడగాల్పులు తోడవ్వడంతో అగ్నిగుండంలా మండిపోతుంది. తెల్లవారడంతోనే సూర్యుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. దాంతో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు.. నగరాలు మధ్యాహ్నం 11.00 గంటలు నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఎవరో కర్ఫ్యూ విధించినట్లు రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.  ఎవరికైనా అత్యవసర పని పడిన బయటకు ఇలా వచ్చి పని చూసుకుని మళ్లీ అలా ఇంటిముఖం పడుతున్నారు. వేసవి మొదలైన నాటి నుంచి  శనివారం వరకు ఇరు రాష్టాల్రలో మొత్తం 427 మంది మృతువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 204 మంది మరణించగా… వారిలో

ఒక్క ప్రకాశం జిల్లాలోనే 63 మంది చనిపోయారు. అలాగే తెలంగాణలో 230 మంది మరణించగా… వారిలో అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే 67 మంది చనిపోయారు. వడదెబ్బతో ప్రతి జిల్లాలో రోజు కనీసం ఎటులేదన్నా 20 మంది మరణిస్తున్నారు. రాత్రుళ్లు కూడా వడగాల్పులు అధికమైయ్యాయి. దీనికి తోడు కరెంట్‌ కోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడిమిని తాళ లేక జనాలు శీతల పానీయాలు, కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్నారు. వడగాల్పులతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.