నియోజక వర్గానికి 1000 డబుల్‌ బెడ్‌రూంలు

2

– రూ.12వేల కోట్ల రుణం ప్రకటించిన హడ్కో

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకాన్ని వేగవంతం చేసేందుకు గృహ నిర్మాణ శాఖ కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న ఇళ్లతో పాటు గతేడాది నిర్మించాల్సిన వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులన్నీ అధిగమించడానికి కసరత్తు చేస్తున్నారు. నిర్ణీత మొత్తంలోనే కట్టడాలను పూర్తి చేసే పరిజ్ఞానం, సలహాలను కోరుతూ ప్రకటనలు కూడా ఇచ్చారు. 15 సంస్థలు దీనికి స్పందించి వివరించేందుకు ముందుకొచ్చాయి. వారం రోజుల్లోగా వీటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి స్పష్టమైన అవగాహనకు రావాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాల వారీగా లెక్కలు: 2015-16లో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 65,446 ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 400 చొప్పున కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లో 2లక్షల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి నాలుగు వేలకు పైగా ఇళ్లను కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యికి పైగా ఇళ్లను కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన నిర్మాణ ప్రణాళికలో కొన్ని మార్పులు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణాన్ని 560 చదరపు అడుగుల్లో పూర్తి చేసేలా గతంలో ప్లాన్‌ రూపొందించారు. దీని ప్రకారం రూ.5.04 లక్షల మొత్తంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేమంటూ కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్లాన్‌లో మార్పులు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ పథకంపై ప్రభుత్వ ఆలోచన విధానం, నిర్మాణ వ్యయం అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొత్త ప్లాన్‌ తీసుకొస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.రెండు లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌  ఇళ్ల నిర్మాణానికి రూ.13,944 కోట్లు అవసరమవుతాయని గృహ నిర్మాణ శాఖ అంచనా వేసింది. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో రుణాల ఆధారంగా నిర్మాణాలను పూర్తి చేయడంపై గృహ నిర్మాణ సంస్థ దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.12 వేల కోట్లు రుణం కావాలని కోరుతూ గృహ నిర్మాణ శాఖ అధికారులు హడ్కోను సంప్రదించి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. విడతల వారీగా రుణం మంజూరు చేస్తామన్న హడ్కో.. తొలి విడతగా రూ.4,500 కోట్లు మంజూరు చేసింది. 2015-16కు సంబంధించి ఇటీవల రూ.1600 కోట్లు మంజూరు చేసింది. మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉండడంతో రెండు జిల్లాలకు కొంత మొత్తం విడుదల చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.