నిరంతరం నేర్చుకోవాలి
-అదృష్టవశాత్తు పదవులు దక్కాయి
-సేవే లక్ష్యం కవాలి
– దుష్ప్రచారాన్ని ఖండించండి
– ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
– సాగర్ శిక్షణా శిబిరంలో టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్
నల్లగొండ,మే 2 (జనంసాక్షి):
నేర్చుకోవడం అన్నది నిరంతర ప్రక్రియ అని, మనకంతా తెలుసని ఎవరైనా అనుకుంటే అంతకన్నా మూర్ఱత్వం మరోటి ఉండబోదని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మనజీవితం బుద్భుద ప్రాయమని, నిరంతరంగా శ్వాస విడిచేవరకు అధ్యయనం చేస్తూనే ఉండాలన్నారు. విజ్ఞానం ఎంతగా సంపాదిస్తే అంతగా రాణిస్తామని అన్నారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిదుల కోసం నిర్వహిస్తోన్న శిక్షణా తరగతుల్లో తొలిరోజు శనివారం ఆయన ప్రసంగించారు. ఈ ప్రాంతం మనకు పూర్తిగా అన్నం పెట్టాల్సి ఉండిందని కానీ మనకు అన్యాయం జరిగిందని సాగర్ నిర్మాణంపై పరోక్షంగా ఆంద్రా పాలకుల తీరును విమర్శించారు.
ఇది పరస్పర అభిప్రాయాలు పంచుకునే వేదిక అని, మొదటిసారిగా అభిప్రాయాలు పంచుకునేందుకు శిక్షణా తరగతులు నిర్వహించుకుంటున్నామని సీఎం తెలిపారు. ఉన్నంతలో పేదలకు ఏ మేరకు సేవ చేశామన్నది ముఖ్యమన్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే మన కార్యాచరణ సాగాలని అన్నారు. సమైక్య పాలకుల వివక్షను తట్టుకోలేక తెలంగాణ ఉద్యమం చేశామని, ఉద్యమం చేసి తెలంగాణ రాష్టాన్న్రి సాధించుకున్నామని కెసిఆర్ అన్నారు. కష్టపడి తెలంగాణ రాష్టాన్న్రి సాధించుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణ రాష్టాన్న్రి అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. వాస్తవానికి మనం ఈ పని ఎప్పుడో చేయాల్సింది కానీ పని ఒత్తిడి వల్ల ఆలస్యమైందని వివరించారు. అంతకుముందు ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్, లింగ్డో,ప్రఖ్యాత ఆర్థికవేత్త హన్మంతరావులు ప్రసంగించిన అనంతరం కెసిఆర్ మాట్లాడారు. పుట్టుకతోనే అన్నీ అలవడవని, ఈ భూవ్మిూద పడ్డ తరవాతనే ఒక్కొక్కటిగా నేర్చుకోవాలన్నారు. మనం ఎమ్మెల్యేలమో, ఎంపీలమో అయినంత మాత్రాన అన్నీ తెలుసన్న గర్వం పనికిరాదని సుతిమెత్తగా హితవు చెప్పారు. ఏది కూడా ఉచితంగా రాదని, దానికి నిరంతర సాధన అవసరమని, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం కూడా సాధన ద్వారా సాధించవచ్చన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నిత్య విద్యార్థిలా ఉండాలని కేసీఆర్ అన్నారు. జీవితం చాలా చిన్నదని, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. పదవులు శాశ్వతం కాదని, మనకే అన్ని తెలుసనుకుంటే పొరపాటేనని కేసీఆర్ అన్నారు. మనకు తెలిసింది కొంతే అని తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి…ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒకరోజు పాటు శిక్షణా తరగతి ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ఈ పదవులు మనకు అదృష్టవశాత్తు వచ్చాయన్నారు. విదేశాల్లో అయితే ఉన్నత పదవులు నిర్వహించిన ప్రధానులు, రాష్ట్రపతులు, మంత్రలు తరవాత తమ వ్యాపకాన్ని ఇతర రంగాల్లో కొనసాగిస్తారని అన్నారు. మనదగ్గరే రాజకీయ పదవులు అనుభవించిన తరవాత మళ్లీ ఏం చేయడానికి ఇష్టపడరని, ఇలాంటి వ్యవస్థను మనం రూపొంపొందించుకున్నామని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలని, నేర్చుకోవడానికి ఎప్పుడూ ముందుండాలని కోరారు. మనకు తెలిసింది కొంతేనని, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుందని వివరించారు. అంత మనకే
తెలుసని అనుకోవద్దన్నారు. ఎవరూ అన్ని రంగాల్లో నిష్టాతులు కాలేరని అది సాధ్యం కూడా కాదన్నారు. నవీన యుగంలో, నవీన శకంలో కొత్త పంథాతో కొత్త ఆలోచనలతో ముందుకెళ్దామని విజ్ఞప్తి చేశారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ రాష్ట్రంగా తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. శిక్షణా తరగతుల వల్ల ఎంతో ఉపయోగం ఉందని, ఇక్కడి సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరస్పర చర్చల ద్వారానే సమస్యలు తెలుస్తాయన్నారు. తెలంగాణ అభ్యుదయమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.
ఆర్థికవేత్త హన్మంతరావును ఎంతో ప్రశంసించాలని పేర్కొన్నారు. ఎవరూ పుట్టుకతోనే గొప్పవాళ్లు కాదని, కష్టపడి శ్రమించి విజ్ఞానం సంపాదించి గొప్పవాళ్లవుతారని తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్, హన్మంతరావు క్లాస్‌మేట్స్ అనే విషయాన్ని సీఎం గుర్తు చేశారు. హన్మంతరావు ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రజ్ఞ సాధించారని వివరించారు. ఆయన అనుకుంటే ఎప్పుడో కేంద్రమంత్రి పదవో, గవర్నర్ పదవో చేపట్టేవారని తెలిపారు. ఇందిరాగాంధీ వంటి మహామహులే హన్మంతరావును గౌరవించే వారని, ఇంటికి పిలిపించుకుని మాట్లాడేవారని తెలిపారు. అంతటి ప్రతిభ ఉన్న వ్యక్తి వెలుగులోకి రాకపోవడానికి కారణం సమైక్య పాలకులే అని తెలిపారు. హన్మంతరావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడైతే ఎప్పుడో వెలుగులోకి వచ్చే వారని తెలిపారు. ఆనాడు ఆయన సహకరాంతోనే విజన్ 2020 డాక్యమెంట్‌ను రూపొందించామని అన్నారు. సిద్ధిపేటకు చెందిన కాపు రాజయ్య గొప్ప చిత్రకారుడని, ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని తాము ఎన్నిసార్లు కేంద్రానికి విన్నవించుకున్న ఆయనకు పద్మశ్రీ రాకుండా ఆంధ్రా పాలకులు అడ్డుకున్నారని వివరించారు. మిషన్ కాకతీయను ఆర్థికవేత్త హన్మంతరావు అభినందించడం సంతోషమని పేర్కొన్నారు. ఆయన సూచనలను పాటిస్తూ మిషన్ కాకతీయను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అట్టడుగు ప్రజలకు కూడా ఉన్నత విద్యను అందించినపుడే గ్లోబలైజేషన్ విజయవంతం అవుతుందని హన్మంతరావు చెప్పారని అన్నారు. ఆర్థికవేత్తగా హన్మంతరావు 60 సంవత్సరాల దేశ పరిస్థితులను చూశారని తెలిపారు. పలు కీలక సూచనలు చేసిన హన్మంతరావు, లింగ్డో, రవికాంత్‌కు రాష్ట్ర ప్రజల తరపున ధన్యావాదాలు తెలిపారు. ఇకపై ప్రతీ ఆరునెలల కొకసారి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. అయితే ఇలా రెండు మూడు రోజులు ఉండదని ఒక్కరోజు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు: సిఎం
ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు సూచించారు. టీఆర్‌ఎస్ శిక్షణా శిబిరంలో పరిపాలన అంశాలపై సీఎం ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మంచి విధానాలను తీసుకొచ్చి వాటిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత లాంటి విషయాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పౌరులు సమాజంలో అనేక పనులు చేస్తూ వ్యవస్థను నడుపుతుంటారు. పౌరులకు అవసరమైన సౌకర్యాలు, సహకారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలపాలని సూచించారు. మంచి విధానాలు రూపొందించుకుని మంచి ఆచరణ చేస్తే అది ప్రజలకు గొప్పగా సేవ చేసినట్లుంటదని పేర్కొన్నారు. ఈ పని కోసం మనం ప్రతీ ఆరు నెలలకొకసారి మాట్లాడుకోవాలన్నారు. మంచి చెడ్డలు చూసుకుని ముందుకుపోదామని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెప్పారు.