నిరుపేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం

3

– సభలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ

హైదరాబాద్‌,మార్చి28(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా మురికి కాలనీల్లోఎలాంటి అనమతులు లేకుండా నివసిస్తున్న నిరుపేదలందరికి పట్టాలిచ్చి ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ వెల్లడించారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వివేక్‌, అజయ్‌ కుమార్‌, రవీంద్రనాథ్‌ తదితరులు అడిగినప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పటివరకు కేవలం లక్షా 25వేల పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇంకా ఇంకా పెండింగ్‌లో ఉన్నవి కేవలం కోర్టు కేసులు, ఇతర లిటిగేషన్ల వల్ల ఉన్నవాటినే వాయిదా వేశామని, వారికి కూడా న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామి ఇచ్చారు. తెలంగాణా రావాలనుకున్నాం… వచ్చింది.. ఇక బంగారు తెలంగాణా నిర్మించేందుకుగాను మురికి కాలనీల్లో అక్రమంగా నివసిస్తున్న వారిలో వెలుగులు నింపేందుకు 125 గజాల స్థలంలో పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని, అలాగే 59 జీఓ ద్వారా అక్రమ కట్టడాలను రెగ్యులర్‌ చేస్తున్నామన్నారు. ఇది అంతా గతంలో ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి డీవియేషన్‌ లేదన్నారు. అయితే సభ్యులు అడిగినట్లుగా దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని, వాటిలో అనేక ఇక్కట్లు ఉండడం వల్లనే ముట్టు కోవడంలేదన్నారు. తొలుత సమస్యలను పరిష్కరించిన తర్వాత వారికి కూడా పట్టాలు ఇస్తామన్నారు. కట్టుకున్న ఇల్ల రెగ్యులరైజేషన్‌లో ఇంటి ముందున్న స్థలాల విషయంలో అఖిలపక్ష సమావేశంలో చర్చించలేదని, త్వరలోనే మరోసారి సీఎం సమక్షంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుందామన్నరు. ఇప్పటివరకు రాష్ట్రంలో హైదరాబాద్‌లో లక్షా 25వేలు, రంగారెడ్డిలో 1.50 లక్షల దరఖాస్తులకు గాను 80వేలు, ఖమ్మంలో 23వేల 393 దరఖాస్తులకుగాను 1473 మందికి పట్టాలిచ్చామన్నారు. ఇంకా మిగిలిఉన్న దరఖాస్తుల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే కలెక్టర్‌లకు ఆదేశాలిచ్చామన్నారు. ఆతర్వాత వారికి పట్టాలిస్తామన్నారు. ఈ సమయంలో మంత్రి ఈటెల రాజేందర్‌ జోక్యం చేసుకుని  ఆగ్రహంతో ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. మంచిదానిని మంచిగా గుర్తించాలని, చెడ్డదాన్ని చెండాల్సిన బాధ్యత ప్రతిపక్షందని అయితే దురదృష్టకరం ఏంటంటే మంచి పనిని కూడా ఆస్వాదించే గుణం లేకుండా పోయిందన్నారు. విూ చూపంతా అక్రమాలు, దందాలు, డబ్బులు తీసుకుని కుప్పలు తెప్పలుగా విలువైన భూములను అప్పనంగా అప్పచెప్పడమే కర్తవ్యంగా నడిపించారని గట్టిగా పేర్కొన్నారు. తెల్లాపూర్‌లో కోట్ల విలువైన భూములను తాత జాగీరులాగా అప్పనంగా ఉప్పుకు పప్పుకు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్ట బెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు.  ప్రతిపక్షం ఇప్పటికైనా మైండ్‌ సెట్‌ మార్చుకోవాలని హెచ్చరించారు.పేదల విషయంలో కూడా విషం చిమ్మాలని చూస్తే మాత్రం ఖబడ్దార్‌ అంటూ ప్రతిపక్షాలపై ఫైర్‌ అయ్యారు మంత్రి ఈటెల రాజేందర్‌… అయితే వెంటనే సీపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ లేచి మంత్రికి కాస్తా అసహనం పెరిగినట్టుంది.. ఈ విషయంలో ఇప్పటివరకు ఏ ప్రతిపక్ష సభ్యుడు కూడా విమర్శించిన పాపాన పోలేదన్నారు. లేనిదానికి లేచి హెచ్చరికలు చేయడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో మంత్రి మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. ఇబ్రహీంపట్నం మండలం రంగాపూర్‌లో నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే పోలీసులను పెట్టి చిన్నా పెద్దా, వృద్దులు, మహిళలు అని తేడాలేకుండా ఈడ్చుకుంటూ తీసుకెల్లడమేకాక వేసుకున్న గుడిసెలను పీకెసిన గొప్ప చరిత్ర కూడా విూ ప్రభత్వహయంలోనే జరిగిందనేది గుర్తుంచుకోవాలని రవీంద్రకుమార్‌ మంత్రి ఈటెలను హెచ్చరించారు. ప్రశాంతంగా సాగుతున్న అసెంబ్లీలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి మంత్రి సభను తప్పుదారి పట్టించాలని చూడడం తగదన్నారు. పేదలపై అంత ప్రేమ ఉంటే ఇప్పటికి ఇంకా లక్షల దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో ఉంచారని ప్రభుత్వాన్ని రవింద్రకుమార్‌ నిలదీశారు.