నిర్మల్‌ చేరుకున్న రాహుల్‌

C

– 15 కి.మీ.ల భారీ పాదయాత్ర

– కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

హైదరాబాద్‌ మే14(జనంసాక్షి):

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ చేరుకున్నారు.గురువారం రాత్రి ఆయన స్థానిక మయూరి ¬టల్‌లో బస చేయనున్నారు. రాహుల్‌ను చూసేందుకు కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకోవడంతో స్వల్ప తోపులాట చేసుకుంది. నేేడు మామడ మండలం కొరిటికల్‌ నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. వడ్యాల వరకు దాదాపు 15కి.మీ మేర ఆయన పాదయాత్ర సాగనుంది. ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతుల్లో మనోస్థార్యాన్ని నింపడంతో పాటు వారికి తమ పార్టీ అండగా ఉంటుందని చాటిచెప్పేందుకు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టిన సంగతి విదితమే.

నాందేడ్‌కు చేరుకున్న రాహుల్‌గాంధీ

రైతుల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణలో పర్యటించనున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దిల్లీ నుంచి మహరాష్ట్రలోని నాందేడ్‌ చేరుకున్నారు. నాందేడ్‌ విమానాశ్రయంలో అయనకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు డీఎస్‌, మధుయాష్కి ఘనస్వాగతం పలికారు. రాహుల్‌ అక్కడి నుంచి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణానికి రోడ్డుమార్గం ద్వారా చేరుకోనున్నారు.

పర్యటన ఇలా..

రాహుల్‌ గాంధీ శుక్రవారం ఉదయం ఏడుగంటలకు నిర్మల్‌ పట్టణంలోని మయూరి ¬టల్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలు దేరి మామడ మండలం కొరిటికల్‌ చేరుకుంటారు. అక్కడ ఈనెల 2వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేశ్వర్‌ కుటుంబాన్ని పరామర్శిస్తారు. రాజేశ్వర్‌ భార్య గంగవ్వ, చిన్నకొడుకు రాకేశ్‌ను వాళ్ల ఇంటికెళ్లి ఓదారుస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పాదయాత్ర ప్రారంభం అవుతుంది. తర్వాత తిరుపల్లి మీదుగా మండల కేంద్రమైన లక్ష్మణచాందకు చేరుకుంటారు. ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డ బోన్ల లింగన్న, సూది లస్మన్నల కుటుంబాలను పరామర్శిస్తారు. పార్టీ పరంగా సహాయం చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి పాదయాత్ర పొట్టపల్లి.కె మీదుగా రాచాపూర్‌కు చేరుకుంటుంది. ఇక్కడ సాతం గంగాధర్‌ కుంటుంబాన్ని పరామర్శించి సాయంత్రం నాలుగు గంటలకు వడ్యాలకు చేరుకుంటారు. అక్కడ బలవన్మరణానికి పాల్పడిన పసుపుల లక్ష్మణ్‌ బాధిత కుంటుబాన్ని పరామర్శించాక అదే గ్రామ పరిసరాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. రాహుల్‌ యాత్ర ప్రాధాన్యం, కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తు ప్రణాళిక పార్లమెంటులో, బయట పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలను వెల్లడిస్తారు. అనంతరం వడ్యాల నుంచి నేరుగా రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలు దేరి వెళతారు. దాదాపు 15కి.మీకిపైగా రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది.