నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయండి

5

– సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన నీటిపారుదల ప్రాజెక్టులపై క్యాంపు కార్యాలయంలో సవిూక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు, భూసేకరణ సమస్యలు లేవు. పాలమూరు ప్రాజెక్టు భూసేకరణ 60శాతం పూర్తయింది. పనులన్నీ సమాంతరంగా జరగాలి. ప్రాజెక్టు ఇన్‌టేక్‌వెల్‌, పంప్‌హౌస్‌ పనులు, కాలువలు, టన్నెల్‌ల పనులు ఏకకాలంలో కొనసాగాలి. అంతారం రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 15టీఎంసీలకు పెంచి రంగారెడ్డి జిల్లాకు నీళ్లందించాలి. ఉద్ధండాపూర్‌ రిజర్వాయర్‌ను 16టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలి. ఉద్ధండాపూర్‌ నుంచి కోస్గి, కొడంగల్‌, నారాయణపేట, ప్రాంతాలకు సాగునీరు అందించాలి. పాలమూరు ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8లక్షల ఎకరాలకు, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద 7లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. నీటిపారుదల ప్రాజెక్టులకు బిల్లులు చెల్లించేందుకు ప్రతి నెలా రూ.2వేల కోట్లు విడుదల చేస్తాం. పనులు పూర్తయిన వెంటనే గుత్తేదార్లకు బిల్లులు చెల్లించాలి. గుత్తేదార్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం వద్దు’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కేసీఆర్‌ సూచించారు. ఈ విషయంలో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై 29న కలెక్టర్ల సదస్సులో చర్చిస్తామన్నారు. వ్యవసాయశాఖ అధికారులు కలెక్టర్ల సదస్సులో పాల్గొని ప్రణాళిక బద్ధంగా చర్చించాలని అన్నారు. పత్తి ఎగుమతి సుంకాన్ని పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని, ఎగుమతి పన్నులో రాయితీని రద్దు చేసేందుకు డబ్ల్యూటీవో సమావేశంలో సంతకం చేసిందని వెల్లడించారు. ఈ పరిణామాలు రైతులు పట్టించుకోకుండా పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని, దీంతో పంటపై అధిక పెట్టుబడులు పెట్టిన రైతులు ధరలేక నష్టపోతున్నారని పేర్కొన్నారు. పరిస్థితులను రైతులకు వివరించాలని వ్యవసాయశాఖ అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.