నీరు భద్రం!

4

– ఇంకుడు గుంతలు లేకపోతే ఇళ్ల అనుమతి వద్దు

– 100 రోజుల సమీక్షలో కేటీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):  రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. నీటి పొదుపుపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. వాటర్‌ వర్క్స్‌కు సంబంధించి 100 రోజుల ప్రణాళికపై మంత్రిబుధవారం ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సమ్మర్‌లో జలాశయాల్లో నీరు తక్కువగా ఉందని, అలాగే భూగర్భ జలాలు తక్కువ మోతాదులో ఉన్నాయని అందువల్ల నీటిపొదుపు తప్పదన్నారు. వర్షాకాలం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా నగరానికి అందుబాటులో ఉన్న నీటి నిల్వల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో మంచినీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో ఉన్న నీటి నిల్వలతో నగరానికి నీళ్లు అందించేందుకు అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇంకుడుగుంత, రెయిన్‌ వాటర్‌ హర్వేస్టింగ్‌ లేకుంటే కొత్త భవనాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న ఐటీ పార్కులు, పారిశ్రామికవాడలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో రెయిన్‌ హార్వెస్టింగ్‌ గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం సంస్థలతో పాటు ప్రజలతోనూ చర్చించాలన్నారు. ఇంకుడు గుంతలు లేని భవనాలకు అనుమతులు, నల్లా కనెక్షన్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఐటీ పార్కులు, పారిశ్రామిక వాడలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వంద రోజుల ప్రణాళిక లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గోదావరి, కృష్ణాలో నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.