నెల్లూరులో పెరిగిపోతున్న చోరీలు ఆందోళనలో ప్రజానీకం

నెల్లూరు, జూలై 18: నెల్లూరు జిల్లాలో రోజురోజుకు చోరీలు పెరిగిపోతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వారంలోనే బక్తవత్సలనగర్‌, వనంతోపు ప్రాంతాలలో 12 దొంగతనాల కేసులు నమోదు కాగా ఇవన్నీ మహిళల మెడలలో బంగారు గోలసులు కత్తెరించిన సంఘటనలు కావడం గమనార్హం. ప్రత్యేకించి 25 సంవత్సరాలలోపు యువకులు మోటార్‌ సైకిళ్ల మీద ప్రయాణిస్తూ ఈ దొంగతనాలకు పాల్పపడినట్లు ఫిర్యాదులు అందాయి. తమిళనాడు నుంచి ఇటీవల నెల్లూరులో సంచరిస్తున్న ఒక ముఠా ఈ తరహా దొంగతనాలు పాల్పడుతుండగా బ్యాంకులో డ్రా చేసుకున్న నగదును ఓ వ్యక్తి నుంచి కాజేసిన సంఘట సంచలనం కలిగించింది. వివరాలలోకి వెళితే నెల్లూరు నగరంలో ఏసీనగర్‌ ప్రాంతానికి చెందిన జి. అరుణకుమార్‌ గూడూరులో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని బార్కాస్‌ సెంటర్‌ వద్ద ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 5 లక్షలు డ్రా చేసి కారు వద్దకు వచ్చారు. అయితే కారు పంచరు అయి ఉండడాన్ని గుర్తించిన అరుణకుమార్‌ మెకానిక్‌ కోసం వెతుకుతుండగా వెనుక నుంచి వచ్చిన 35 ఏళ్ల యువకుడు ఎదురు మెకానిక్‌ ఉన్నారని సంప్రదించాల్సిందిగా కోరారు. వెంటనే మెకానిక్‌ను తీసువచ్చి కారు రీపైర్‌ చేయిస్తున్న క్రమంలో అరుణకుమార్‌ తన వద్ద ఉన్న 5 లక్షల రూపాయలను కారులో ఉంచారు. తిరిగి చూసేసరికి కారులో నగదు కనిపించలేదు. దీంతో ఆయన నాల్గవ పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లాలోని పలు బ్యాంకుల్లో ప్రతి రోజు కోట్లలాది రూపాయల నగదు లావాదేవిలు జరుగుతుండగా బ్యాంకుల వద్ద సరైన పోలీస్‌ నిఘా లేకపోవడం వల్లనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.