నేడు ఓట్ల లెక్కింపు

2

నేడు వరంగల్‌,ఖమ్మం కార్పోరేషన్ల,అచ్చంపేట నగరపంచాయతీ ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌,మార్చి8(జనంసాక్షి): వరగంల్‌, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు, అచ్చంపేట నగరపంచాయితీ ఎన్నికల కౌంటింగ్‌ బుధవారం జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం నుంచి కౌంటింగ్‌ మొదలై మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడిస్తారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించి ఎనమాముల మార్కెట్‌ యాడ్‌లో సిబ్బందికి అధికారులు శిక్షణ ఇచ్చారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 6న 58 డివిజన్‌లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఉద్యోగులకు మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ కౌంటింగ్‌ ఉద్యోగులకు

పలు సూచనలు చేశారు. మొత్తం 50డివిజన్లు ఉండగా.. రెండు డివిజన్లకు ఒక టేబుల్‌ చొప్పున, 20టేబుళ్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ఈవీఎం లెక్కింపు సమయంలో జాగ్రత్త వ్యవహరించాలని సూచించారు. బుధవారం పత్తిమార్కెట్లో జరుగనున్న లెక్కింపునకు ఉదయం 6.00గంటల కల్లా ఉద్యోగులు హాజరుకావాలని ఆదేశించారు. ఆయన వెంట జేసీ దివ్య, ట్రైనీ కలెక్టర్‌ ముషారఫ్‌, డీఆర్వో శ్రీనివాస్‌, మాస్టర్‌ ట్రైనీ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా  అచ్చంపేట నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు ఐదు రౌండ్లలో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నాగర్‌కర్నూలు ఆర్డీవో దేవేందర్‌ రెడ్డి తెలిపారు. మండల వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఒక్కో రౌండ్లో నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేసి లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల అధికారి సాబేర్‌ అలీ, ఎన్నికల సహాయ అధికారులు జయంత్‌కుమార్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.