నేడు ఫ్లోర్ లీడర్ల సమావేశం
అసెంబ్లీలో దాడిపై ప్రధాన చర్చ
హైదరాబాద్,మార్చి08(జనంసాక్షి): అసెంబ్లీ ఉభయ సభల శాసన సభాపక్ష నేతలు భేటీ కానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు నేతలు సభాపతి మధుసూధనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌తో సమావేశం కానున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ చేసిన ప్రసంగం సందర్భంగా సభ్యులు జాతీయగీయాన్ని అవమానపరచారని పాలక పక్షం ఆరోపిస్తుండగా తమపై అధికార పక్ష సభ్యులు భౌతిక దాడులకు పూనుకున్నారని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫ్లోర్ లీడర్ల సమక్షంలో విజువల్స్‌ను చూసేందుకు సభాపతులు అంగీకరించారు. అత్యంత కీలకమైన పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్యం యత్నిస్తోంది. ఇదే అదునుగా సభలో తమపై భౌతిక దాడి జరిగిందని విపక్ష సభ్యులు పట్టుబడుతూ దాడికి పాల్పడిన సభ్యులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసే అవకాశాలున్నాయి.