నేనెలా నిందితున్నవుతా..
బొగ్గు కంభకోణం కేసులో సుప్రీం గడపనెక్కిన మన్మోహన్
న్యూఢిల్లీ,మార్చి 25(జనంసాక్షి): మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ కింది కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన సవాల్ చేశారు. కోల్‌స్కామ్ కేసులో ఏప్రిల్ 8న తమ ముందు హాజరుకావాల్సిందిగా మన్మోహన్ సింగ్‌తో పాటు మరో ఐదుగురిని సీబీఐ కోర్టు ఆదేశించింది. సీబీఐ కోర్టు ఆదేశాలను నిలిపివేయాలంటూ మన్మోహన్ పిటిషన్‌లో కోరారు. యూపీఏ హయాంలో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అందులో పాత్ర ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కింది కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. దాంతో మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేటాయింపు సందర్భంగా మన్మోహన్ కోల్ వ్యవహారాలను చూస్తున్నారు. సిబిఐ తాఖీదులు ఇవ్వడంతో బొగ్గు కుంభకోణంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఒడిసాలో బొగ్గు గనులను అక్రమంగా కేటాయించిన కుంభకోణంలో నేర పూరిత కుట్ర, అవినీతి ఆరోపణలపై విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టు ఏప్రిల్ 8 న హాజరు కావాలంటూ మన్మోహన్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. కుమార మంగళం బిర్లా కూడా ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనను హాజరు నుంచి మినహాయించాలంటూ సుప్రీం కోర్టును మన్మోహన్ సింగ్ కోరారు. ఈ తీర్పుతో కలత చెందాననీ, కానీ జీవితంలో ఇదీ ఒక భాగమే అంటూ సింగ్ విూడియాకు చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన తరఫు లాయయర్లు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. గత జనవరిలో మన్మోహన్ను ప్రశ్నించింది. ఈ కేసు విచారణకై ఏర్పాటయిన ప్రత్యేక కోర్టు.. సీబీఐ దాఖలు చేసిన తుదిచార్జిషీట్ను పరిశీలించిన అనంతరం ఏప్రిల్ 8 లోగా తన ముందు హాజరుకావాలని మన్మోహన్ సహా మరో ఐదుగురికి సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. బొగ్గు కుంభకోణం కేసు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మెడకు చుట్టుకుంటోంది. బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదని గతంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్‌ను సీబీఐ ఇంతకు ముందే ప్రశ్నించింది. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖను పర్యవేక్షిస్తున్న సమయంలో హిండాల్కో సంస్థకు అక్రమంగా గనులు కేటాయించారని ఆరోపణలున్నాయి. ఈ కేటాయింపులకు సంబంధించి బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పరేఖ్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.