నేపాల్‌లో ఆకలి కేకలు
– మృతుల సంఖ్య 10వేల ఉండొచ్చు
– ప్రపంచ దేశాలు ముందుకొచ్చి ఆదుకోవాలి
-నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా
ఖాట్మండ్,ఏప్రిల్28(జనంసాక్షి)
భారీ భూకంపం ధాటికి సర్వం కోల్పో యిన నేపాల్ వాసులు ఆహారం, మం చినీటి కోసం అలమటించి పోతున్నారు. నేపాల్‌లో భూకంప ప్రభావిత ప్రాం తాల్లో బాధితుల ఆకలి కేకలతో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. శిథిలాల కింద నుంచి ఓ పక్క వందలాది శవాలు బయటపడుతున్నాయి. మరో పక్క ప్రాణాలతో బయటపడిన వారు నిలువ నీడలేక బిక్కు బిక్కుమం టూ గడుపుతున్నారు. దాదాపుగా ఇళ్లు నేలమట్టాయి. కొన్నింటికి బీటలు వారాయి. కూలని ఇళ్లల్లో ఉండేందుకు జనం వణుకుతున్నారు. వరుస ప్రకం పనల కారణంగా ఎప్పుడు ఏమవుతుందో అని వారు ఆరుబయటే కాలం వెల్లదీస్తున్నారు. నేపాల్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కార ణంగా 8 మిలియన్ల మంది ప్రభావితులైనట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వారిలో 1.4 మిలియన్ల మంది ఆహారం కోసం అలమటిస్తున్నారని స్పష్టం చేసింది.నేపాల్‌లో భూకంప మృతుల సంఖ్య 10వేలకు చేరవచ్చని నే పాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు అవసరమైన స్థాయిలో జరగడం లేదని
ప్రధాని అంగీకరించారు. ఇప్పటికే మృతుల సంఖ్య ఐదువేలు దాటిందని, అంతకంతకూ మృతుల సం ఖ్య పెరుగుతోందన్నారు. ఈ ఘటనలో 8వేల మందికి పైగా గాయపడ్డారని, క్షతగాత్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని సుశీల్ కొయిరాలా తెలిపారు. ప్రపంచ దేశాలు ఉదారంగా ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. ఇదిలావుంటే వివిధ దేశాలతో పాటు భారత్ సహాయక బృందాలు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ భూకంపం నుంచి నేపాల్ చాలాకాలం వరకూ కోలుకునేలా కనిపించడం లేదు. భారీ భూకంప ఘటనలో ఇప్పటికే 4,350మంది మృతిచెందగా, 8వేల మందికి పైగా గాయపడ్డారు. నేపాల్ బాధితులను ఆదుకోడానికి భారత్ సహా పలు దేశాలు ముందుకొచ్చాయి. పేకమేడల్లా కుప్పకూలిన భవన శిథిలాల నుంచి సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీస్తున్నారు. భూకంపం ధాటికి ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారు మూడు రోజులుగా రోడ్డు విూదే జీవనం సాగిస్తున్నారు. పలు దేశాలకు చెందిన సహాయక సిబ్బంది ఆహార, వైద్య సామాగ్రిని నేపాల్‌కు తరలించి బాధితులకు అందిస్తున్నారు. నేపాల్‌లో భూకంపం తర్వాత నాల్గవ రోజైన మంగళవారం ప్రజలు కొద్ది కొద్దిగా తేరుకుంటున్నారు. ఖాట్మండ్‌లో భూకంప బీభత్సాన్ని మానవరహిత విమానం ద్రోణ్ నుంచి చిత్రీకరించారు. చారిత్రక భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. సగం కూలిన భవనాలు, ఇళ్లలోకి వెళ్లేందుకు ధైర్యం చాలక, గుంపులు గుంపులుగా రోడ్లవిూదే తిరుగుతున్న నేపాలీ ప్రజలు… స్థూలంగా చెప్పాలంటే ఇదీ ఖాట్మండ్ పరిస్థితి. పర్యాటక ప్రదేశాలు ఆనవాలు లేకుండా నేలకొరిగాయి. కొన్ని గ్రావిూణ ప్రాంతాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లిన అధికారులకు దిగ్భాంతికి లోనయ్యే దృశ్యాలు కనిపిస్తున్నాయి. భూకంపానికి కొండరాళ్లు దొర్లుకుంటూ ఊళ్లవిూదపడ్డాయి. దాంతో గ్రామాల్లోకి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వైద్య బృందాలు అక్కడికి కాలినడకనే చేరుకుంటూ క్షతగాత్రులకు సేవలు అందిస్తున్నాయి. కొన్ని చోట్ల మూడు రోజులకు కూడా సాయం అందడం లేదు. సోమవారం రాత్రి కూడా స్వల్పంగా భూమి కంపించింది. గూర్ఖా ప్రాంతంలో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. కుటుంబానికి ఒకరిద్దరూ కూడా బతికి బట్టకట్టలేదు. అయితే నేపాల్ ప్రభుత్వం తమను ఆదుకోలేకపోతోందని ప్రజలు మండిపడుతున్నారు మరోవైపు శిధిలాలకింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేపాల్ వెళ్లిన భారత పర్యాటకులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఖాట్మండు శిథిల నగరంగా మారిందన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అయినవారిని, ఆత్మీయులను కోల్పోయిన బాధను కొద్ది కొద్దిగా దిగమింగుకుంటున్నారు. సహాయక శిబిరాల్లో కాలం గడుపుతున్నారు. కొద్దిగా వాన కురిస్తే ఉలిక్కిపడుతున్నారు. అంతలోనే ఏవిూ కాలేదంటూ సర్దుకుంటున్నారు. భారత్ సహా ప్రపంచ దేశాలు సాయం చేస్తున్నప్పటికీ నేపాల్ ప్రభుత్వం ఏం చేయలేకపోతోందని నేపాలీ ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషాద సమయంలోనూ వ్యాపారులు ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారు. పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వం కనీసం వ్యాపారులనయినా నిలువరించలేకపోతోందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పటికే మూడు రాత్రులు గడిచిపోవడంతో శిథిలాల్లో చిక్కుకున్నవారు ప్రాణాలతో ఉండే అవకాశాలు తగ్గిపోతాయని భయపడుతున్నారు. దాంతో వీలైనంతత్వరగా శిథిలాలను తొలగించడానికి కష్టపడుతున్నారు. భారత్ నుంచి వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక ప్రజలు శిథిలాలను తొలగించే పనిలో మునిగిపోయారు.
తమిళనాడుకు సురక్షితంగా చేరిన 32 మంది
నేపాల్ భూ విలయం నుంచి తప్పించుకొని తమిళనాడుకు చెందిన 32మంది సురక్షితంగా వారి స్వస్థలానికి చేరుకున్నారు. ఖాట్మండ్ విమానాశ్రయం నుంచి దిల్లీకి చేరుకున్నవారిని అక్కడి నుంచి మరో విమానంలో చెన్నైకి పంపినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన మరికొంతమందిని కూడా త్వరలోనే స్వస్థలానికి చేర్చుతామని అధికారులు తెలిపారు. నేపాల్‌లో తమిళనాడు కు చెందిన వారు మొత్తం 311మంది చిక్కుకుపోయారని, వారిని సురక్షితంగా స్వస్థలానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
దిల్లీ చేరుకున్న కరీంనగర్ వాసులు
ఖాట్మండ్ నుంచి ఆరుగురు కరీంనగర్ వాసులు దిల్లీ చేరుకున్నారు. వీరిలో భూకంపంలో గాయపడిన ఇద్దరికి దిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను స్వస్థలాలకు పంపించేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంచినీటి కోసం బారులు..
సహాయ బృందాలు అందించే ఆహారం, మంచినీటి కోసం పునరావాస శిబిరాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. భారత్, అమెరికా, యూకే సహా పలు దేశాలు భూకంప బాధితుల కోసం సహాయక సామగ్రిని పంపిస్తున్నప్పటికీ వేలాది మంది బాధితులకు అవి సరిపోవడం లేదు. చిన్నారులు ఆహారం కోసం అలమటించే దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రజలకు ఎలాంటి సహాయక సామగ్రి అందండం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరా తగ్గిపోవడంతో సరుకుల కోసం అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు.
ఆరుబయట కటిక చీకటిలో..
భూకంపం ధాటికి ఇళ్లు, వీధులు, భవనాలు, విద్యుత్‌స్తంభాలు, పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు గుడారాల్లోనే ఉంటున్నారు. విద్యుత్ లేక రాత్రిపూట ఆరుబయట కటిక చీకటిలో గడుపుతున్నారు. ఫోన్ల ఛార్జింగ్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. పెట్రోలు, డీజిల్ కోసం బంకుల వద్ద బారులు తీరుతున్నారు. తక్షణమే విద్యుత్, మంచి నీటి సౌకర్యం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
వైద్య సహాయం కోసం ఎదురుచూపులు..
ఇంతటి ఘోర ప్రమాదంతో నేపాల్‌లో వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. దీంతో ఆస్పత్రులు, వైద్యసిబ్బంది, మందులు ఏమాత్రం చాలడం లేదు. వందల సంఖ్యలో క్షతగాత్రులకు ఆస్పత్రుల ఆవరణల్లో, శిబిరాల్లో, ఆరుబయట నేలపైనే చికిత్స అందిస్తున్నారు. మందులు, వైద్య పరికరాలు సరిపోక విదేశాల సహాయం కోసం నేపాల్ ఎదురుచూస్తోంది. సరైన సదుపాయాలు లేక క్షతగాత్రులు, చిన్నారులు ఆరుబయట పడుతున్న కష్టం కంటతడి పెట్టిస్తోంది. వివిధ విభాగాల్లో నైపుణ్యులైన వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు, ఔషధాలను పంపించాలంటూ నేపాల్ ప్రభుత్వం విదేశాల సహాయం కోరుతోంది.
సహాయక చర్యలకు ఆటకంగా మారుతున్న వర్షం..
నేపాల్‌లో వరుస భూప్రకంపనల తర్వాత కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికితీయడం, క్షతగాత్రులను తరలించడానికి సహాయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్ సహా వివిధ దేశాల నుంచి వచ్చిన సహాయక సిబ్బంది నేపాల్‌లో సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.