నేపాల్‌లో మళ్లీ భూకంపం
– ఐదు సార్లు ప్రకంపనలు
– 42 మంది మృతి
– వేలాది మందికి గాయాలు
– రిక్టర్ స్కేలు 7.3గా నమోదు
ఖాట్మండ్,మే12(జనంసాక్షి): హిమాలయ దేశం నేపాల్‌లో మళ్లీ భూకంపం వణికించింది. రెండు వారాల క్రితం వచ్చిన భూకంపంలో 8 వేల మంది మృతి చెందగా మంగళవారం వరుసగా వచ్చిన భూకంపానికి 42 మంది మృతి చెందినట్లుగా తెలియవచ్చింది. వరుసగా ఐదుసార్లు భూమి కంపించినట్లు నమోదయ్యింది. కొండచరియలు విరిగిపడి వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12-35 గంటల ప్రాంతంలో తొలి భూకంపం రాగా రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు అయింది. రెండో భూకంపం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సంభవించింది. అది రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదు అయింది. మొదటి భూకంప కేంద్రం నేపాల్ రాజధాని ఖాట్మండ్‌కి… ఎవరెస్టు పర్వతానికి మధ్య రెండో భూకంప కేంద్రం నేపాల్‌లోని కోడారి ప్రాంతానికి 73 కిలోవిూటర్ల ఆగ్నేయంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంప ప్రభావానికి చౌటారా ప్రాంతంలో ఒక భవనం నేలకూలింది. దీనిప్రభావంతో ఎంతమంది చనిపోయారు నష్టం ఎంతన్నది ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. నేపాల్‌లో భూకంపం సంభవించిన కొద్ది రోజులకే మళ్లీ ఈ సంఘటన జరగడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేపాల్ దుర్ఘటన చోటుచేసుకున్నప్పటినుంచి అప్పుడప్పుడు భారతదేశం అంతటా తరచు భూమి స్వల్పంగా కంపిస్తూనే ఉంది. ఈ పరిస్థితులలో ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. నేటి భూప్రకంపనం దాదాపు ఒక నిమిషం పాటు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నేపాల్ సరిహద్దులోని టిబెట్‌లోనూ భూకంప ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. టిబెట్‌లోని జిలాంగ్, ఝాంగ్ము కౌంటీలలోని పర్వతాలపై నుంచి రాళ్లు దొర్లిపడ్డాయి. దీంతో పలు చోట్ల ఇళ్లు ధ్వంసమై ఉంటాయని అధికారులు అంచనావేస్తున్నారు. పరిస్థితిని సవిూక్షిస్తున్నామని, సహాయక చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నామని జిలాంగ్ కౌంటీ ప్రభుత్వ వైస్ చీఫ్ వాంగ్ వెన్‌జియాంగ్ తెలిపారు. నేపాల్‌లో మంగళవారం సంభవించిన భూకంప ప్రభావంతో మృతిచెందిన వారి సంఖ్య 14కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. మూడు వందల మందికి పైగా గాయపడినట్లు సమాచారం. నేపాల్‌లో అధికారులు, సహాయ సిబ్బంది సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మరోసారి భూకంపం రావడంతో మళ్లీ భవనాలు కూలిపోయాయి. హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది గాయపడ్డవారిని ఆసుపత్రుల్లో చేర్పిస్తున్నారు. సహాయ చర్యలకు ఉపక్రమించామని, కూలిపోయిన భవనాల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య ఇంకా పూర్తిగా తెలియలేదని అక్కడి పోలీసులు తెలిపారు.