నో.. నెవర్..
– సెక్షన్ 8 ఒప్పుకోం
– అవసరమైతే ఆమరణ నిరహార దీక్ష
– గవర్నర్‌తో సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
హైదరాబాద్,జూన్23(జనంసాక్షి):
హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలుకు ఒప్పుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఓటుకునోటు కేసు వేరని, సెక్షన్ 8 వేరని గవర్నర్‌కు తెలియచేసినట్లు సమాచారం.అవసరమైతే తాను ఆమరణనిరాహర దీక్షకు సిద్దమని, ఈ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని కూడా అన్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం గవర్నర్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. గంటకుపైగా జరిగిన భేటీలో సెక్షన్-8పై చర్చ జరిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ సెక్షన్-8ను అంగీకరించబోమని కేసీఆర్ గవర్నర్‌కు తేల్చి చెప్పారని అంటున్నారు. ఏడాదిగా హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో విూరే చూశారని, అయినా ఇప్పుడే ఈ వ్యవహారం ఎందుకు వచ్చిందో విూకు తెలియంది కాదని అన్నారు. ఒకవేళ సెక్షన్-8పై కేంద్రం ముందుకెళ్లాలని చూస్తే అదే స్థాయిలో బదులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే ఢిల్లీలో దీక్షకు దిగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెక్షన్-8పై సీరియస్‌గా ఉన్న తెలంగాణ సర్కార్…గవర్నర్‌తో భేటీకి ముందు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిద్దామని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. అయితే కేంద్రం జోక్యం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడాలని నరసింహన్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సైతం గవర్నర్‌తో భేటీ అవుతారని వార్తలు వచ్చినా అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. దీంతో నేడో రేపో గవర్నర్‌తో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాదులో సెక్షన్ 8కు ఎట్టి పరిస్థితుల్లోను తాము అంగీకరించే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏడాది కాలంలో ఏపీ వారి పైన ఎక్కడా దాడులు జరగలేదని చెప్పారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఆటంకాలు సృష్టిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఎసిబి కేసులో విషయాలను, కేసు తాజా పరిస్థితులను కెసిఆర్ వివరించారని అంటున్నారు. ఈ విషయంలో చట్టప్రకారం ముందుకు పోతామని, వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని అన్నట్లు తెలుస్తోంది.