న్యాయమడిగితే నేరమట !

ఉద్యమ దిగ్గజాలు కోదండరామ్‌,

కేసీఆర్‌లకు కోర్టునోటీసులు
విశాఖపట్నం, జనవరి 31 (జనంసాక్షి):
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరాంలకు విశాఖ జిల్లా లోక్‌ అదాలత్‌ గురువారం సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 15న హాజరు కావాలని ఆదేశించింది. సమరదీక్ష సందర్భంగా కేసీఆర్‌, కోదండరాం జాతీయ, ఆంధ్ర ప్రాంత నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ న్యాయసేవా సదన్‌లో ఫిర్యాదు చేసింది. జనవరి 28న ఇందిరాపార్కు వద్ద జరిగిన సమరదీక్షలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. ప్రధానిని, ఆంధ్ర ప్రాంత నేతలను చవటలు, సన్నాసులు అంటూ కేసీఆర్‌ విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి జేఏసీ న్యాయ సేవా సదన్‌ను ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి.. కేసీఆర్‌, కోదండరాంలకు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 15న హాజరు కావాలని ఆదేశించారు. కేసీఆర్‌, కోదండరాంలపై ఇప్పటికే సీమాంధ్ర జిల్లాల్లోని పలు పోలీసుస్టేషన్లలో సమైక్యాంధ్ర వాదులు ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆయనకు విశాఖ జిల్లా న్యాయసేవా సదన్‌ నోటీసులు జారీ చేయడం గమనార్హం.