న్యాయ నిపుణులతో సంప్రదించాకే బీసీ ఆర్డినెన్స్‌కు మద్దతిచ్చా
` నా బాటలోకే బీఆర్‌ఎస్ నేతలు రాకతప్పదు
` ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
` బీఆర్‌ఎస్ నాయకులు బీసీ ఆర్డినెన్స్‌పై మొహం చాటేశారని విమర్శలు
` తీన్మార్ మల్లన్న విమర్శలను ఖండిరచకపోవడంపై ఆగ్రహం
హైదరాబాద్(జనంసాక్షి): బీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చారు. ఇంటిపార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని.. బీఆర్‌ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు.. అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని చెప్పారు. తాను న్యాయపరంగా అందరినీ సంప్రదించే కాంగ్రెస్ తెచ్చిన ఆర్డినెన్స్‌ను సమర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇందుకోసం వారు నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్ కు బహిరంగ మద్దతును ప్రకటించారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌కు తాను మద్దతు ఇస్తునట్లు చెప్పారు. తనపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ కు బీఆర్‌ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని.. దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో విూడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అన్నాచెల్లాల మధ్య గ్యాప్ రావడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికి ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్.. కవితకు షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇంఛార్జ్‌గా ఉన్న కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించారు. కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం గులాబీ పార్టీలో, రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కవితకు పార్టీలో, అనుబంధ సంఘాల్లోనూ ప్రాధాన్యం తగ్గుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత.. బీఆర్‌ఎస్ పార్టీపై చేసిన ఆరోపణలతో ఆ పార్టీకి, ఆమెకు దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. అన్నపై ఉన్న కోపంతో కవిత ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నేతలు స్పందించకపోవడమనేది దారుణమని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. ఈ విషయం బిఆర్‌ఎస్ నేతల విజ్ఞతకే వదిలివేస్తున్నానని, తన దారికి భారత రాష్ట్ర సమితి నేతలు రావాల్సిందేనని స్పష్టం చేశారు. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాతనే బిసి రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. రెండు బిల్లులు పెట్టాలని తొలుత డిమాండ్ చేసింది కూడా తానేనని తెలియజేశారు. బనకచర్లపై చర్చకు వెళ్లనని సిఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని, బుధవారం ఢల్లీి సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల అని పేర్కొన్నారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించడం మంచి పద్దతి కాదని హితువు పలికారు. ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య బనకచర్ల ప్రాజెక్టుపై చర్చలు జరిపారని తెలియజేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాలు హక్కులు తెలంగాణ రాష్ట్రం కోల్పోతుంద న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు గోదావరి జలాలను ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారని దుయ్యబట్టారు. బనకచర్లతో తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి చెప్పడం లేదని కవిత చురకలంటించారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ఏడారిగా మారే అవకాశం ఉందన్నారు. తెలంగాణ హక్కులను చంద్రబాబు నాయుడు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని, దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలించే హక్కులేదని, తక్షణమే రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు. గోదావరి రివర్ మెనేజ్‌మెంట్ బోర్డు హైదరాబాద్‌లో ఉంటే కృష్ణా రివర్ మెనేజ్‌మెంట్ విజయవాడలో ఉంటుందని విభజన చట్టంలో ఉందని చెప్పారు. రెండు నదులకు సంబంధించిన బోర్డు విషయంలో రేవంత్ రెడ్డి చేసిందేవిూ లేదని చురకలంటించారు. మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రిపేర్లు తెలంగాణ ప్రభుత్వం చేయాలని, ఎపి భూభాగంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ రిపేర్లు చంద్రబాబు ప్రభుత్వం చేయాలని విభజన చట్టంలో ఉందన్నారు. నదులు అనుసంధానం విషయంలో కమిటీలు ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏవిూ లేదని కవిత మండిపడ్డారు.