పంట నష్టంపై కేంద్రం సహాయం..కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

2

హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతాంగాన్ని కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రైతులకు పంట నష్టపరిహారం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మూడోవంతు నష్టం జరిగినా పరిహారం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనివల్లెందరో రైతులకు మేలు చేకూరుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ… పంటనష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందాక కేంద్ర బృందం పర్యటిస్తుందని తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు తేమ శాతాన్ని 27శాతానికి పెంచినట్లు చెప్పారు. అలాగే ఈ నెల 19న పంట నష్టంపై ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక అందజేస్తామని  వెంకయ్యనాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టంపై నివేదిక ఇచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల తాను, తమ ఎంపీలు ఇతర పార్టీ నాయకులు పలు ప్రాంతాల్లో  పర్యటించామన్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించామన్నారు. తమ పార్టీ పరంగా కూడా నివేదిక సిద్దం అవుతోందన్నారు. కరీనంగర్‌ జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటపొలాలను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించి రైతులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. స్థానిక బిజెపి నాయకుల సాయంతో ఆయన పర్యటించారు. వడగళ్ల వాన వల్ల తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. కరీంనగర్‌ జిల్లాలోనే 20వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని వివరించారు. జిల్లాలో రైతులు ఎక్కువగా ఉద్యాన పంటలు సాగుచేశారని, వరి, పసుపు, మామిడి, బొప్పాయి, అరటి తోటలు దెబ్బతిన్నాయన్నారు. చేతికి వచ్చిన పంటలు నష్టపోవడం వల్ల రైతుల్లో ఆవేదన నెలకొందన్నారు. వడగళ్ల వాన, అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. అయితే అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కేంద్రం ప్రభుత్వ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి  అన్నారు.  కొత్త నిబంధనల విధానాల ద్వారా పంటనష్టం అంచనా వేయాల్సినవసరం ఉందని చెప్పారు. వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.18వేలు, ఆహార పంటలకు ఎకరానికి రూ.13 వేలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. తాము స్వయంగా చూసిన విషయాలను నివేదిస్తామని అన్నారు. అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను అన్ని విధాల కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర వెంకయ్యనాయుడు హావిూ ఇచ్చారు.  పంటనష్టపోయిన వారిని ఆదుకోవడంతో పాటు, తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  ఎలాంటి ఆంక్షలు లేకుండా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలనివివిధ ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా రైతులు  కోరారు.