పటేళ్లకు 10శాతం రిజర్వేషన్
– తలొగ్గిన గుజరాత్ సర్కారు
గాంధీనగర్,ఏప్రిల్ 29(జనంసాక్షి): గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు చెందిన పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. గుజరాత్ దివస్ ను పుసర్కరించుకుని మే 1 నుంచి కొత్త రిజర్వేషన్ అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పటికే అమలవుతోన్న 49 శాతం మించబోదని, అగ్రవర్ణాల పేదలకు ప్రకటించిన 10 శాతం కోటా కూడా ఆ పరిథిలోనే అమలవుతుందని తెలిపింది. ఇటీవల పటేళ్ల రిజర్వేసన్ ఉద్యమం నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రిజర్వేషన్లు లేని కులాల్లో కూడా పేద వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, కళాశాలల్లో కోటా ఇవ్వనున్నారు. వార్షిక ఆదాయం రూ.6లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇబిసిలకు మాత్రమే ఈ కోటా వర్తిస్తుంది. ఈ విధానం మే 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ శుక్రవారం వెల్లడించారు. గత కొన్ని రోజులుగా రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న పటేల్/ పటీదార్ కులస్థులకు కూడా ఈ రిజర్వేషన్లు వర్తించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మైనార్టీలకు ఇప్పటికే ఉన్న రిజర్వేషన్‌తో పాటు ప్రస్తుతమున్న రిజర్వేషన్ కూడా కలుస్తుంది. పటీదార్ కులస్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, కళాశాలల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆందోళనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా కూడా మారాయి. దీంతో గుజరాత్‌లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. 10 శాతం రిజర్వేషన్లపై మే1న నోటిఫికేషన్ విడుదల కానుంది. మరో వైపు బ్రాహ్మణులు, వైశ్యులు కూడా ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం తప్పని సరైంది. కొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే 50శాతం రిజర్వేషన్లు కాకుండా జనరల్‌లో ఉండే మరో 50 శాతం రిజర్వేషన్లలో ఈ 10శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. రాష్ట్రంలో అధికంగా ఉన్న ఉన్నతవర్గాలైన పటేళ్లకు కూడా రిజర్వేషన్లో భాగం కల్పించారు. రిజర్వేషన్ల కోసం పటీదార్ కులస్తులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించడం, సవిూప భవిష్యత్ లో ఆధిపత్య కులాలుగా కొనసాగుతున్న ఇంకొన్ని కులాలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో ఆయన ఆమోదంతోనే ఈ నిర్ణయం వెలువడినట్లు సమాచారం. ఇప్పుడు 49 శాతం రిజర్వేషన్లు పొందుతున్న కులాల ప్రయోజనాలకు కోతపడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై భిన్నస్పందనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఏమేరకు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుందో వేచి చూడాలి. అటు హర్యాణాలోనూ జాట్ల డిమాండ్లకు తలొగ్గిన మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆ వర్గానికి విద్య, ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే. పలు రాష్టాల్ల్రో ఉన్నత వర్గాలుగా పేరుపొందిన కులాల్లోని పేదలు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కుతోన్న పరిస్థితుల్లో నిన్న హరియాణా, నేడు గుజరాత్ ప్రభుత్వాలు ప్రకటించిన నిర్ణయాలు ఉద్యమాలకు మరింత ఊపునిచ్చేలా ఉన్నాయి. ఈ రెండు రాష్టాల్లోన్రూ బీజేపీయే అధికారంలో ఉండటం గమనార్హం. ఎపిలో కాపులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.