పనామాకు తొలి వికెట్‌

1

– ప్రధాని రాజీనామా

లండన్‌: ‘పనామా పేపర్స్‌’ ప్రకంపనలకు ఐస్‌ లాండ్‌ ప్రధాని సిగ్ముందర్‌ గున్లలగ్సన్‌ తన పదవికి మంగళవారం రాత్రి రాజీనామా సమర్పించారు. పనామా పత్రాల్లో తన పేరు వెల్లడికావడంతో ఆయన రాజీనామా చేశారు. ఆ దేశ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు ఆయన రాజీనామా చేశారు. రాజకీయ వర్గాల నుంచి విమర్శలు రావడంతో మంగళవారం ఉదయం ప్రెసిడెంట్‌ను కలసి రాజీనామా విషయంపై చర్చించారు. దీనికి ఆ దేశ ప్రెసిడెంట్‌ ఒల్ఫర్‌ రగ్నార్‌ అంగీకరించకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు.ఆ తర్వాత రగ్నార్‌ తాజా పరిణామాలపై ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ప్రధానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తడంతో ప్రధాని రాజీనామాకు ప్రెసిడెంట్‌ సిఫార్సు చేశారు. దీంతో ప్రధాని సిగ్ముందర్‌ గున్లలగ్సన్‌ రాజీనామా చేశారు. మరోవైపు పనామా దేశం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద లీక్‌ బాగోతంగా భావిస్తున్న ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది. పనామా పేపర్స్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సంపన్నులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, దేశాధ్యక్షులు.. ఇలా చాలామంది పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో అక్రమంగా నల్లడబ్బు దాచినట్టు వెలుగులోకి వచ్చిన వివరాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.