పరిశ్రమలకు విద్యుత్‌ కోతలుండవు

5

సీఐఐ సదస్సులో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలమైనదని ముఖ్యమంత్రి కెసీఆర్‌ మరోమారు పునరుద్ఘాటించారు. అలాగే పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు ఉండబోవని కూడా స్పష్టం చేశారు. మరో రెండు నెలలు దాటితే అన్ని విద్యుత్‌ సమస్యను అదిగమిస్తామన్నారు.  నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సీఐఐ సదస్సులో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ…  పారిశ్రామికాభివృద్ధికి విద్యుత్‌ రంగం ప్రధానమైనదని పేర్కొన్నారు. ఐటీఐఆర్‌ లాంటి ప్రాజెక్టులకు 24 గంటల కరెంటు అవసరం.అందుకే కరెంట్‌ సమస్యలేకుండా అదనపు ఉత్పత్తిపై దృష్టి పెట్టామని అన్నారు. ఏడాది క్రితం ఇదే సమయంలో కరెంటు కష్టాలు ఎదుర్కొన్నామని, ఈ ఏడాది దాదాపు విద్యుత్‌కోతలు లేకుండా చూస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలో విద్యుత్‌ కోత అనేది తెలియని స్థితికి రాష్టాన్న్రి తీసుకెళ్తామన్నారు. 24 గంటలూ నాణ్యమైన నిరంతర విద్యుత్‌ అందిస్తామన్నారు. అంచనా లేని జలవిద్యుత్‌ కన్నా థర్మల్‌ విద్యుత్‌పైనే ఆధారపడతామని, త్వరలోనే 2 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు పరిశ్రమల కోసం తెలంగాణలో లక్షన్నర ఎకరాల భూమి సిద్ధంగా ఉందని చెప్పారు. దామరచర్లలో రూ.40వేల కోట్లతో జెన్‌కో, సింగరేణి ఆధ్వర్యంలో 6600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.  ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్లు కొనుకోలు చేస్తున్నామన్నారు.  పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌ ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. సౌత్‌గ్రిడ్‌, నార్త్‌గ్రిడ్‌ ఇంకా అనుసంధానం కాలేదు. ప్రస్తుతం పరిశ్రమలకు కరెంటు కోతలు లేవని పేర్కొన్నారు. దేశంలో ఫార్మా యూనివర్సిటీ ఎక్కడా లేదు. ఇంటర్నేషనల్‌ ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఫార్మా సిటీ త్వరలో ప్రారంభంకాబోతున్నదని చెప్పారు. రాచకొండ గుట్టల్లో ఫిలీం సిటీని నిర్మిస్తాం.  పరిశ్రమల కోసం భూములు సమృద్ధిగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీల కోసం కేంద్రంతో మాట్లాడుతున్నామని అన్నారు. శంషాబాద్‌కు సవిూపంలోనే భూములు అందుబాటులో ఉన్నాయని, రాచకొండ గుట్టల్లో 35 వేల ఎకరాలు అందుబాటులో ఉందని కేసీఆర్‌ అన్నారు. ఎలక్టాన్రిక్‌ హార్డ్‌వేర్‌, చిత్రనగరికి ఈ భూములు కేటాయిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫార్మాసిటీ కోసం భూమి సేకరిస్తున్నామని, గ్రేటర్‌ చుట్టుపక్కల జిల్లాల్లో లక్షన్నర ఎకరాల భూములు ఉన్నాయని కేసీఆర్‌ తెలిపారు. జలహారం ద్వారా 10 శాతం నీరు పరిశ్రమలకు అందిస్తామన్నారు.