పరిశ్రమల స్థాపనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..సీఎం కేసీఆర్‌

5

మెదక్‌ జిల్లాలో ఫ్యాక్టరీ విస్తరణకు సీఎంతో ఎంఆర్‌ఎఫ్‌ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, సపరేటర్స్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన షాపూర్‌జీ పాలంజీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :  రాష్ట్రంలో పరి శ్రమల ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కలిపిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. పరిశ్రమల స్థాపనను రాష్ట్ర హక్కుగా భావించి పరిశ్రమల వ్యాప్తికి  ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన వెల్లడించారు. ప్రముఖ టైర్ల కంపెనీ ఎంఆర్‌ ఎఫ్‌ సంస్థ సిఎండీ మమెన్‌, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ తంబురాజ్‌ గురువారం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలుసుకొన్నారు. మెదక్‌ జిల్లా సదాశివపేట మండలం అంకంపల్లి గ్రామంలో నెలకొల్పిన ఫ్యాక్టరీని విస్తరించాలని నిరన్ణయించినట్లు ఎంఆర్‌ ఎఫ్‌ సిఎండీ ముఖ్యమంత్రికి తెలిపారు. 1990 సంవత్సరంలో కంపెనీ నెలకొల్పామని , రూ.4300 కోట్ల వార్షిక టర్నోవర్‌ తో 6500 మందికి ఉపాధి కల్పిస్తున్నామని ఆయన సీఎంకు తెలియజేశారు. రూ.980 కోట్లతో ఫ్యాక్టరీని విస్తరించనున్నట్లు చెప్పారు. అదనంగా 905 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది పరిశ్రమలకు విద్యుత్తు కోతలు లేకుండా చర్యలు తీసుకొన్నందుకు ఎంఆర్‌ ఎఫ్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రికి అభినంధనలు తెలిపారు.   ఫ్యాక్టరీ విస్తరణకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరరిస్తుందని  ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలో పరిశ్రమలకు కరెంటు కోతలు లేవని , భవిష్యత్తులో కూడా కరెంటు సమస్య ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా అన్నారు. పరిశ్రమలకు అవసరానికి తగ్గట్లు నీటిని సరఫరా చేస్తామన్నారు. తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు పూర్తయితే పరిశ్రమలకు కావలసినంత నీటిని సరఫరా చేస్తామన్నారు.రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని, త్వరలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, ఆర్ధిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర పాల్గొన్నారు.