పాక్ ప్రధాని గిలానిపై ‘సుప్రీం’
అనర్హత వేటు: పాక్‌లో అనిశ్చితి
ఇస్లామాబాద్, జూన్ 19 (జనంసాక్షి):
పాకిస్తాన్ మంగళవారం తాజాగా రాజకీయ అనిశ్చితిలోనికి జారుకుంది.ప్రధాని యూసుఫ్ గిలానీపై అక్కడి సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది.అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పాలనావ్యవహారాలు చూడాలని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌధురి నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ఫెమిదా డోలాయమానంగా ఉన్నారని, రెండు నెలల క్రితమే గిలానీపై నేర నిర్థారణ జరిగినప్పటికీ ఆయనను అనర్హునిగా ప్రకటించలేదని ఆరోపిస్తూ పలు పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి.వాటిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు గిలానీపై వేటు వేసింది.ఏప్రిల్ 26నుంచే ప్రధాని పదవి ఖాళీగా ఉందని కోర్టు రూలింగ్‌ఇచ్చింది.అధ్యక్షుడు జర్దారీ స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనంపై గిలానీ అవినీతి కేసులు తెరవనందుకు ఆయనపై ఏప్రిల్ 26న సప్త సభ్య ధర్మాసనం నేరనిర్ధారణ చేసింది. గిలానీ (60) ఇక పాక్ ప్రధానిగా ఉండజాలరని, పార్లమెంటు సభ్యునిగా కొనసాగరని పేర్కొంటూ బెంచ్, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు అధ్యక్ష పాలన కొనసాగాలని ఆదేశించింది. కోర్టు ఇలాంటి రూలింగ్ ఇవ్వగలదని రాజకీయ వర్గాలు కొంతకాలంగా ఊహిస్తూనే ఉన్నాయి. నేర నిర్థారణ జరిగిన నిందితుడిని 180 మిలియన్ల మంది జనాభా కలిగిన పాకిస్థాన్ ఎలా అంగీకరిస్తుందని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.2009 డిసెంబర్ నుంచి పాక్ న్యాయవ్యవస్థకు ప్రభుత్వానికి ఘర్షణ జరుగుతూనే ఉంది.