పాతబస్తీని నిర్లక్ష్యం చేసిన పాలకులు

C
ఏ ప్రభుత్వ కార్యక్రమమూ చార్మినార్‌ నుంచి మొదలు కాదు

ముఖ్యమంత్రులక్కడ పర్యటించరు

ఆకలి కేకలతో పెరుగుతున్న సామాజిక నేరాలు

కడుపేదరికంతో తెగుతున్న పేగుబంధాలు

పాతబస్తీని రాజ్యంలో అంతర్భాగంగా చూడాలి

బంగారు తెలంగాణలో భాగస్వామ్యం చేయాలి

హైదరాబాద్‌, మే 17(జనంసాక్షి) : ముత్యాలు రాశులుగా పోసి అమ్మారక్కడ. నాలుగొందల ఏళ్ల పైచిలుకుగా చార్మినార్‌ ఠీవీగా నిలబడి ఎందరో విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. మహిళలు అమితంగా ఇష్టపడే గాజులు, బిర్యానీ, హలీమ్‌, కుర్బానీ కా మీఠా, ఇరానీ చాయ్‌, పాయా రోటీ, బోటీ కబాబ్‌ ఎన్నింటికో వారసత్వ నిలయం. ప్రపంచ పర్యాటక రంగంలో నేషనల్‌ జాగ్రఫీ ట్రావెలర్‌ మేగజీన్‌ రెండో స్థానంతో మన హైదరాబాద్‌ గౌరవాన్ని దక్కించుకుంది. అందుకు ప్రధాన కారణం ఫలక్‌నుమ ప్యాలెస్‌, చార్మినార్‌, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్‌లే. నైట్‌ బజార్‌లో కూడా విదేశీ మహిళా టూరిస్టులు అక్కడ కలియదిరుగుతారు. స్థానికులు వారిని ఎంతో గౌరవంగా చూస్తారు. హిందూ ముస్లిం సఖ్యతకు ప్రపంచంలోనే మత సామరస్యానికి ప్రతీక మన పాతబస్తీ. గంగా జమునా తహెజీబ్‌ సంస్కృతిపై విదేశీ విద్యార్థులు సైతం  పరిశోధనచేసి పీహెచ్‌డీ పట్టాలు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నిర్లక్ష్యానికి ఈ ప్రాంతం రాష్ట్ర పటంలో అంతర్భాగం కాదన్న తీవ్ర ద్రోహానికి గురైంది. సమైక్య పాలనలో ముఖ్యమంత్రులు ఈ ప్రాంత ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలు లేవక్కడ. ఉన్న సిటీ పోలీసు కమిషనర్‌ కార్యాలయాన్ని కూడా కొత్త బస్తీకి తరలించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అక్కడికి దరిచేరవు. ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం స్కూళ్లు నెలకొల్పరు. ఇబ్బడిముబ్బడిగా బాల కార్మికులు కనిపిస్తారు. రెక్కాడితే కానీ డొక్క నిండదు. అక్కడి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కలేదు. ఉర్దూ మీడియం చదివిన కారణంగా సమైక్య పాలనలో వారికి దక్కాల్సిన ఉద్యోగాలన్నీ ఫ్రీజోన్‌ పేరుతో సీమాంధ్రులు గద్దల్లా తన్నుకుపోయారు. నిర్లక్ష్యానికి గురై నిరుద్యోగం పెరిగిన చోట సామాజిక నేరాలు సహజంగానే పెరుగుతాయి. కడుపేదరికం కారణంగా పిల్లలు చిల్లర దొంగతనాలు చేస్తున్నారని ఓ సామాజిక సర్వేలో తేలింది. ఎక్కువ మంది పిల్లల కారణంగా వారి పెళ్లిల్లు చేయలేక వృద్ధులైన అరబ్‌ షేకులకు పుట్టెడు దుఖ్కంతో పేగు బంధాలను తెంచుకుంటున్నారు. ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. బ్యాంకులు అప్పివ్వవు. సహకార సంస్థలు దరిచేరవు. ప్రభుత్వ ఋణాలు దరిచేరవు. రాజధానికే కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న పురానా షెహర్‌ నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో పెను ప్రమాదాల్ని చూడాల్సి ఉన్నా ఆశ్చర్యంలేదు. ఇక్కడి ప్రజల్ని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు సర్కారు నడుం బిగించాలి. షాదీ ముబారక్‌, వాటర్‌ గ్రిడ్‌ లాంటి పథకాలు వారి దరిచేరాలి. ఆహార భద్రత కల్పించాలి.

హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం పదేపదే చెప్తోంది. వందల యేళ్ల చరిత్రగల హైదరాబాద్‌ నగరంలో పాతబస్తీ ఒక ప్రత్యేక ప్రాంతం. నవాబుల కాలం నుంచి అలలారిన ఓల్డ్‌సిటీ వలస పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురై నేడు నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. సామాజిక నేరాలు విపరీతంగా పెరుగుతున్న ప్రాంతాల్లో హైదరాబాద్‌ పాతబస్తీ ముందు వరసలో నిలబడుతోంది. పాతబస్తీలో జరుగుతున్న అరాచకాలను అదుపుచేసే పటిష్ట యంత్రాంగం లేకపోవడంతో, ఉన్న కొద్దిపాటి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నేరాలు అధికమవుతున్నాయి. మహిళలపై దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. కడు పేదరికంతో పెళ్లిల్లు చేయలేక అమ్మాయిల తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను వృద్ధ అరబ్బు షేకులకు కాంట్రాక్టు పద్దతిలో పెళ్లిచేస్తున్నారు. నిన్నటికి నిన్న ఓల్డ్‌ సిటీలో జరిగిన స్ట్రీట్‌ ఫైట్‌ ఉదంతం చూస్తే పాతబస్తీ యువత పెడధోరణుల పోకడలు అర్థం చేసుకోవచ్చు. చిన్నచిన్న కారణాలకే హత్యలదాకా వెళ్లే సంస్కృతికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కేవలం ఆధిపత్యం కోసం పక్కా ప్రణాళికతో ఎవరికీ అనుమానం రాకుండా హత్యలు చేసే ఇలాంటి సంస్కృతిని అదుపు చేయాల్సి ఉంది. దీనికంతటికీ కారణం పాతబస్తీపై పాలకుల నిర్లక్ష్యమేనని స్పష్టంగా చెప్పొచ్చు.

అసలు హైదరాబాద్‌ పుట్టుక మొదలైందే పాతబస్తీ నుంచి. కుతుబ్‌షాహీల కాలంలో నిర్మించిన చార్మినార్‌ కేంద్రంగా విస్తరించిన పాతబస్తీ నిజాం పాలనలో విశేషంగా అభివృద్ధి చెందింది. చారిత్రక కట్టడం చార్మినార్‌ మొదలు ఫలక్‌నుమ పాలెస్‌, చౌమహల్లా ప్యాలెస్‌ లాంటి ఎన్నో విలాసవంతమైన చారిత్రక కట్టడాలకు పాతబస్తీయే కేంద్రం. విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే పాతబస్తీ చారిత్రక కట్టడాలు, మదీనా బిర్యానీ, హలీమ్‌లకు ప్రపంచఖ్యాతి ఉంది. నిజాం రాజ్యంలో రాజధానిలోని పాతనగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. ప్రపంచం నలుమూలల నుంచి రకరకాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకునేవారు. నిజాం కాలంలో ముత్యాలు, నగలు, వజ్రాల వ్యాపారానికి సైతం హైదరాబాద్‌ పాతబస్తీ ప్రపంచంలోనే ప్రధాన కేంద్రంగా ఉండేది. నిజాం కాలంలో పాతబస్తీలో పురుడుపోసుకున్న అద్భుత కట్టడాలెన్నో. ఎందరో విదేశీయులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారంటే పాతబస్తీ గొప్పదనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదంతా గతంగానే మిగిలిపోయింది. వలస పాలకుల నిర్లక్ష్యానికి చరిత్ర సాక్ష్యాలెన్నో ధ్వంసమయ్యాయి. పాలకుల నిర్లక్ష్యానికి చారిత్రక ఘనత ఉన్న పాతబస్తీ చరిత్రలో కలిసిపోయే ప్రమాదంలో పడిపోయింది.

పాతబస్తీలో కనీస మౌళిక సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో గత పాలకుల పరిపాలన సాగింది. పిల్లలకు చదువుకునేందుకు అవసరమైన పాఠశాలలు కూడా పాతబస్తీలో సరిగ్గాలేవు. ఏపూటకాపూట సంపాదించుకుని తినే కుటుంబాలు అత్యధికంగా ఉన్న ఆ ప్రాంతంలో తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపలేక పనులకు పంపాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక చారిత్రక నగరంగా పేరున్న హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని సామాన్య జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి దాపురించింది. చిన్న చిన్న

తగాదాలు చినికి చినికి గాలి వానలా మారి వీధిపోరాటాలకు, హత్యలకు దారితీస్తున్నాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు మాత్రం ఎప్పుడో కర్ఫ్యూ విధించినప్పుడు తప్ప కనిపించే పరిస్థితి లేదు. నిత్యం 144 సెక్షన్‌ విధించి పోలీసులు, ప్రభుత్వం చేతులు దులుపుకుంటుండటంతో సామాన్యులకు తీవ్ర ఇక్కట్లు తప్పటంలేదు. పాతబస్తీని అభివృద్ధి చేసి, అక్కడ నివసించే ప్రజల అవసరాలకు తగిన సౌకర్యాలు కల్పిస్తే నేరాలు తగ్గే అవకాశం ఉంది. అందుకే అభివృద్ధిలో పాతబస్తీని ఖచ్చితంగా భాగం చేయాల్సిన అవసరం ఉంది. పాతబస్తీ పేదలకు సర్కారు సంక్షేమ పథకాలు పక్కాగా అందేలా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ యంత్రాంగం పాతబస్తీపై ప్రత్యేక దృష్టిపెడితే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో పాతబస్తీని భాగం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అక్కడి జనం జీవన ప్రమాణాలు మెరుగు పరిచి, వారిని అభివృద్ధి బాటలో నడిపితేనే నేరాలు అదుపు చేయొచ్చు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పాతబస్తీని సందర్శించిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం గత పాలకుల్లా కాకుండా పాతబస్తీ వాసుల బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాతబస్తీపై ప్రత్యేక దృష్టిపెడితే ఖచ్చితంగా పాతబస్తీవాసులు అభివృద్ధి బాటలో

పయనిస్తారు. ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకాలను పాతబస్తీ వాసులకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛ

హైదరాబాద్‌లో భాగంగా పాతబస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించి

చిద్రం చేసిన పాతబస్తీ వాసుల బతుకుల్లో తొలి తెలంగాణ సర్కారు వెలుగులు నింపాలి. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు పాతబస్తీ అభివృద్ధిపై దృష్టిపెట్టి, ప్రభుత్వ పథకాల్లో అక్కడి స్థానికులను భాగస్వాములను చేయాలి. పాతబస్తీ సంస్కృతీ సాంప్రదాయాలకు భంగం వాటిల్లకుండానే పారుశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, అక్కడ నివసించే ప్రజలకు అవసరమైన అన్ని సంస్థలను ఏర్పాటు చేస్తే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడి అభివృద్ధి బాటలో పయనించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. పాతబస్తీని రాష్ట్రంలో అంతర్భాగంగా చూసి ప్రత్యేక దృష్టిపెడితేనే బంగారు తెలంగాణలో భాగమై కల సాకారమవుతుంది.