పాత చట్టాలకు పాతర

5

– దేశాభివృద్ధికి సంస్కరణలు తప్పవు

– ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,ఆగస్టు 26(జనంసాక్షి): భారత్‌ రూపురేఖలను వేగంగా మార్చాలంటే ముందు మనం మారాలి, మన ఆలోచనా విధానం మారాలి.. చట్టాలను మార్చాలి.. అనవసర విధానాలకు స్వస్తి పలకాలి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  నీతి ఆయోగ్‌ ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా మోదీ మాట్లాడారు. త్వరితగతిన దేశాన్ని అభివృద్ధి బాట పట్టించడమే తన లక్ష్యమని, క్రమ పరిణామం అన్నది తన ఎజెండా కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. 19వ శతాబ్దపు పరిపాలన వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం సాధ్యం కాదని మోదీ అన్నారు.  మన ఆలోచన విధానం మారితేనే పరిపాలనలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని, వినూత్న ఆలోచనలే మన మైండ్‌సెట్‌ను మార్చగలవని ఆయన చెప్పారు. మారుతున్న కాలనుగుణంగా వేగంగా మారడం అలవాటు చేసుకుంటేనే ముందుకు సాగగలమని అన్నారు. మనం చట్టాలను మార్చాలి.. అనవసర విధానాలకు స్వస్తి పలకాలి.. విధానాలను వేగవంతం చేయాలి.. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.. 19వ శతాబ్దపు పరిపాలన వ్యవస్థతో 21వ శతాబ్దంలో ముందుకు సాగలేమని గుర్తుంచుకోవాలని  మోదీ గట్టిగా నొక్కి చెప్పారు. మార్పు అనేది ఇంటా, బయటా ఉండాలని సూచించారు. 30 ఏళ్ల కిందట ఓ దేశం అంతర్గతంగా పరిష్కారాల కోసం వెతికి విజయవంతం అయి ఉండొచ్చని, కానీ అది ఇప్పుడు సాధ్యం కాదని మోదీ అన్నారు. ఆనాటి ప్రయోగమే ఈనాడూ పనిచేస్తుందని అనుకోవడం సరికాదన్నారు. ఇప్పుడు ఏ దేశం ఒంటరిగా అభివృద్ధి సాధించలేదని, అన్ని దేశాలను కలుపుకుపోవాలని అభిప్రాయపడ్డారు. దేశ యువత ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పాత విధానాలను కొనసాగించడం కుదరదని స్పష్టంచేశారు. పుస్తకాలు చదవడం ద్వారా వ్యక్తిగతంగా ఎవరికివాళ్లు వినూత్న ఆలోచనలు చేయగలగుతారని, కానీ అందరం కలిస్తేనే వాటిని అమలు చేయడం సాధ్యమవుతుందని మోదీ అన్నారు. ప్రధానంగా యువత చేతుల్లోనే దేశ భవిష్యత్‌ ఉందన్నారు. వారే పథనిరన్దేశకులన్నారు.