పారిశ్రామిక విధానంపై 12న ప్రభుత్వ ప్రకటన
విద్యుత్‌శాఖలో ఖాళీలను భర్తీ చేస్తాం- సీఎం కేసీఆర్
హైదరాబాద్,జూన్6(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక విధానం ‘టీఎస్ ఐపాస్’ను ఈ నెల 12వ తేదీన ప్రభుత్వం ప్రకటించనుంది. అదే రోజున పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల, పారిశ్రామిక ప్రతినిధులతో హైటెక్స్‌లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రముఖ కంపెనీల సీఈఓలకు ఆహ్వానాలు అందజేయనుంది. ప్రముఖుల సమక్షంలో ప్రభుత్వం తన విధానాలను ప్రకటించనుందని సమాచారం. ఐపాస్ ప్రకటనను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని ఈనెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు హెచ్‌ఐసీసీలో ప్రకటించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం ప్రకటన ఏర్పాట్లపై శనివారం అధికారులతో ఆయన సవిూక్ష నిర్వహించారు. విధాన ప్రకటన వెలువడిన మరుక్షణమే దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని, ఆరోజే ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక వెబ్‌సైట్‌లో పారిశ్రామిక విధానం పొందపరచాలని సూచించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, సీఈవోలు, ప్రభుత్వరంగ సంస్థల అధిపతులు, సీఐఐ, ఫిక్కీ, ఎఫ్‌టీఏ, సీపీఐ, క్రెడాయ్, రియల్, ఐటీ, ఫార్మా సంస్థల ప్రతినిధులకు ఆహ్వానం పంపాలని అధికారులను ఆదేశించారు.
పరిశ్రమలకు భూమి కేటాయింపులు, అనుమతులన్నీ కేవలం 15 రోజుల్లోనే వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అన్ని రకాల పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యుత్ సంస్థలో ఖాళీల భర్తీ
ఇదిలావుంటే తొలి వసంతం పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. విద్యుత్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలోని జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపాలని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును సీఎం ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా నియామకాలు చేపడుతామని సీఎం స్పష్టం చేశారు. తొలి ఏడాది కోతల్లేని విద్యుత్ అందించడంలో విద్యుత్ ఉద్యమం పాత్ర ఎంతో ఉందని విద్యుత్ శాఖ ఇంజినీర్లను సీఎం అభినందించారు. ప్రస్తుతం విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఆ అవసరం ఉండదన్నారు. భవిష్యత్‌లో మిగులు విద్యుత్ సాధిస్తామన్నారు. విద్యుత్ శాఖ లాభాలు గడించే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల జీతాలు కూడా పెంచుకునేందుకు సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌లు జెన్‌కో ద్వారానే నెలకొల్పుతామని ప్రకటించారు. ఉదయం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జెఎసి సిఎంను కలిశారు.
సిద్దయ్య భార్యకు ఉద్యోగం
క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను ఎస్‌ఐ సిద్ధయ్య భార్య ధరణి కలిశారు.ఎస్‌ఐ సిద్ధయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. డిగ్రీ పూర్తి కాగానే సిద్ధయ్య భార్య ధరణికి ఉద్యోగమిస్తామని పేర్కొన్నారు. సిద్ధయ్య కుటుంబానికి పెంచిన ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఇటీవల తీవ్రవాద కాల్పుల్లో ఎస్‌ఐ సిద్ధయ్య మృతి చెందిన విషయం విదితమే.