పాలమూరు ఎత్తిపోతలపై ఆంధ్రా బాబుల కుట్రలు
– మంత్రి హరీశ్ రావు
మహబూబ్‌నగర్,ఏప్రిల్ 30(జనంసాక్షి): రాబోయే ఐదేళ్లలో పాలమూరు జిల్లాలోని 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇరిగేషన్ శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌లో హరీశ్‌రావు పర్యటన రెండో రోజూ కొనసాగింది. భారీ బైక్ ర్యాలీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పర్యటనలో భాగంగా మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావుతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ఆంధ్రా పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు ఎత్తిపోతల పథకం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోతలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఏపీకి చెందిన రైతులతో సుప్రీంకోర్టులో కేసులు వేయిస్తున్నా టీడీపీ నేతలు స్పందించడంలేదని విమర్శించారు. ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి స్పందించక పోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలోని చెరువులను నాశనం పట్టించాయని ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పటిష్ట పరుస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. పూటకో ఉత్తరం
రాసి పాలమూరు ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని పాలమూరు ప్రాజెక్టు కట్టొద్దని ఆంధ్రా కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ సహకరిస్తదా? సహకరించదా తేల్చుకోవాలన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే రాజకీయ భవిష్యత్ ఉండదనే కాంగ్రెస్, టీడీపీలు ప్రాజెక్టు అడ్డుకోవాలిని చూస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రజలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. పాలమూరు ప్రజల గోస తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రతిపక్షాలు సహకరించాలన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుట్లు వెట్టడించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. పనులన్నీ పూర్తి చేయాలంటే మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు. ఇదిలావుంటే తెలంగాణ వ్యాప్తంగా ఇంకుడు గుంతల తవ్వకాలను ఉద్ధృతం చేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. శప్రతి చినుకూ మన భూభాగంలోనే ఇంకేలా చేయాలని, వర్షపు నీటితో భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇంకుడు గుంతల తవ్వకానికి ఉపాధిహావిూ పథకంలో ప్రభుత్వమే డబ్బులు ఇస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంతల తవ్వకాన్ని ఉపాధిహావిూ పథకంలో చేర్చామన్నారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉపాధిహావిూ నిధులతోనే ఇంకుడు గుంతల తవ్వకాలను చేపడతామన్నారు. పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో దీనిని తప్పనిసరి చేస్తామని, ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకురావాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉందన్నారు.
ప్రాజెక్టులను వ్యతిరేకించడంపై మంత్రి హరీష్ మండిపాటు
ఏపీ నేతలపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుపై చంద్రబాబు, జగన్ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విూ రాజకీయాల కోసం ప్రాజెక్టులను పావుగా వాడుకోవద్దని హితవుచెప్పారు. మానవత్వం ఉన్నవారు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోరని, వైఎస్ బాటలోనే జగన్ నడుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రైతులను సాకుగాచూపి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు.తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని హరీశ్‌రావు అన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకానికి వ్యతిరేకంగా జగన్ దీక్ష చేస్తామనటంపై మహబూబ్‌నగర్ పర్యటనలో ఉన్న మంత్రి స్పందిస్తూ.. పాలమూరు-రంగారెడ్డి పథకానికి వ్యతిరేకంగా జగన్ దీక్ష చేస్తామంటున్నారు. ఏపీ ప్రతిపక్షనేత జగన్ తలపెట్టిన నిరసన దీక్షను వ్యతిరేకిస్తున్నాం అన్నారు. తెలంగాణ వాటా నీళ్లకు గండికొట్టి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అక్రమంగా రాయలసీమకు తరలించుకుపోయిండు. అదే తండ్రిబాటలో పయనిస్తూ వైఎస్ జగన్ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నిస్తుండు. మరో చంద్రబాబు సీడబ్ల్యూసీకి లేఖలు రాస్తూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. రైతులచే హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతాం. పోతిరెడ్డిపాడు, హంద్రీనివా వలె పాలమూరు అక్రమ ప్రాజెక్టు కాదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను సక్రమంగా నిర్మిస్తున్నమని ప్రాజెక్టును పూర్తి చేసి వలస జిల్లాను సస్యశ్యామలం చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.