పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం

2

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న హావిూ మేరకు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నామని నీటిపారుదశాఖ మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని గోపాల్‌పేట మండలం యెదులాపూర్‌లో బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పూటకో ఉత్తరం రాసి పాలమూరు ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు కట్టొద్దని ఆంధ్రా కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేస్తున్నారని అన్నారు.  అక్రమంగా హంద్రినీవాకు నీళ్లు తీసుకుపోతే డీకే అరుణ హరతి పట్టింది. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు రఘువీరా ధర్నా చేస్తుంటే డీకే అరుణ నోరు ఎందుకు పెగలడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో ప్రకారం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కడుతున్నం. పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ సహకరిస్తదా? సహకరించదా తేల్చుకోవాలన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే రాజకీయ భవిష్యత్‌ ఉండదనే కాంగ్రెస్‌, టీడీపీలు ప్రాజెక్టు అడ్డుకోవాలిని చూస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రజలు టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలను భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామన్నారు. సిఎం పట్టుదలతో రాజకీయపార్టీలకు బెంగపట్టుకుందన్నారు.  పాలమూరు ప్రజల గోస తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రతిపక్షాలు సహకరించాలి. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రిటైర్డ్‌ ఇంజినీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు కట్టేందుక సహకరించిన రైతులకు పాదాభివందనం అన్నారు.  నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. అందుకోసం ఏదుల గ్రామానికి రూ.2 కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని, . పాలమూరు ఎత్తిపోతల దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  పాలమూరు ప్రజలకు ఎంత చేసినా తక్కువే. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం. పనులన్నీ పూర్తి చేయాలంటే మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. కొల్లాపూర్‌ మండలం నార్లపూర్‌ సవిూపంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను మంత్రి ఆవిష్కరించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టు మంజూరు చేస్తే ఇష్టం లేకుండా సంతకాలు చేసి, ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోనే రికార్డు స్థాయిలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపడుతుందని తెలిపారు. అవసరమైన భూములు ముందుగా సేకరించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా త్వరితగతిన పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హావిూ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ‘అంజనగిరి’గా నామకరణం చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని హావిూ ఇచ్చారు.మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశాయని ఆరోపించారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి, జేసీ రాంకిషన్‌, ఇరిగేషన్‌ ఈఎన్‌సీ ఛీప్‌ మురళీధర్‌, ప్రాజెక్టు సీఈ లింగరాజు తదితరులు పాల్గొన్నారు.