పాలేరు మాదే!
– మంత్రి కేటీఆర్ ధీమా
హైదరాబాద్,ఏప్రిల్ 21(జనంసాక్షి): ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభకు జరగనున్న ఉప ఎన్నికల్లో గెలుపు తమదే అని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. ఖమ్మంలో అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలే ఇందుకు దోహదపడతాయని అన్నారు. ఖమ్మం, పాలేరు వేర్వేరు కాదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. గురువారం హైదరాబాద్లో కేటీఆర్ మాట్లాడుతూ… ఖమ్మం జిల్లాపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల ముద్ర ఉందని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో అన్ని పక్షాలు ఏకమైనా విజయం మాత్రం మాదే అని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీకి అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరామని తెలిపారు. ఓ వేళ ఎన్నికల సంఘం షరతులు విధించిన వాటిని పాటించి ప్లీనరీ నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. మంత్రి తుమ్మల నివాసంలో టిఆర్‌ఎస్ నేతలు సమావేశమై పాలేరు ఎన్నికపై చర్చించారు. ఇందులో మంత్రి కెటిఆర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మంత్రి కేటీఆర్ పాలేరు ఉపఎన్నికపై చర్చించారు. పాలేరులో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్సే గెలుస్తుంది. మంత్రి తుమ్మల సారథ్యంలో ఖమ్మం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఖమ్మం వేరు పాలేరు వేరు కాదు. ఖమ్మం కార్పోరేషన్ ఫలితాలే పాలేరు ఉప ఎన్నికల్లో వస్తాయన్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ చాలా బలపడింది. పాలేరు ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కడతారని తెలిపారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ…పాలేరు నియోజకవర్గం ఎంటో నాకు నేనేంటో పాలేరు ప్రజలకు తెలుసు. పార్టీ నిర్ణయం మేరకు పాలేరులో పోటీ చేస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఎన్నికల ప్రధాన ఎజెండా. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇదిలావుంటే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీచేయాలని ఆ పార్టీ జిల్లా నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఉప ఎన్నికపై చర్చించేందుకు గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పాలేరు నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో పాతమిత్రులుగా ఉన్న నామా, తుమమల పోటీ పడనున్నారు. వీరిద్దరూ టిడిపిలో నేతలుగా ఉన్నారు.